వినాయ‌క చ‌వితి  సందడి ప్రారంభ‌మైంది. చాలా చోట్ల  ఇప్పటికే భారీ గణపతుల విక్రయాలు పూర్తవుతున్నాయి. వినాయ‌కుడి ఎలా జ‌న్మించాడు? అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంటుంది. ఈ క‌థ తెలుసుకుంటే ఎలా జ‌న్మించాడు? అన్న విష‌యం తెలుస్తుంది. గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు. ఈ క్ర‌మంలోనే శివుని తన శరీరములో దాచుకొన్నాడు.


భర్తకు కలిగిన ఈ స్థితిని చూసి పార్వతీ దేవి దుఃఖంచింది. దీంతో పార్వతి దేవి భర్తను విడిపించుట‌కు ఉపాయము కోసం విష్ణు మూర్తి ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అప్పుడు విష్ణువు గంగిరెద్దు వ‌లే వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు. గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు. గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు. దీంతో విష్ణువు వ్యూహము ఫలించినది. అప్పుడే నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడ‌ని, శివుడిని నందీశ్వరుని వశము చేయుమ‌ని అడిగాడు.


అప్పుడు గజముఖాసురుడు శ్రీహరి అని గ్ర‌హించి.. మాట తప్ప‌లేక త‌న శ‌రీరంలో ఉన్న‌ శివుని ఉద్దేశించి ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది. తన శిరస్సును లోకపూజ్యము చేయమని కోరి, తన శరీరమును నందీశ్వరుని వశము చేసి మ‌ర‌ణించాడు. నందీశ్వరుడు అత‌ని శ‌రీరాన్ని చీల్చి  శివునికి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని కైలాసానికి వెళ్లాడు.  


కైలాసములో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి, ప్రాణము పోసింది. తను స్నానమునకు పోవునపుడు ఆ బాలుని వాకిలివద్ద కాప‌లి ఉంచింది. ఆ బాలుడు ద్వారము దగ్గర శివుని అడ్డుకొన్నాడు. కోపించిన‌ శివుడు బాలుని తల తెగవేశాడు. విషయము తెలిసికొని పార్వతి హతాశురాలైంది. ఆప్పుడు శివుడు గజాసురుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించి గణపతిగా నియమించాడు. ఇలా వినాయ‌కుడు జ‌న్మించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: