ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి జరుపుకుంటే చదువు సంధ్యలు, వృత్తి ఉద్యోగాలు వేటిల్లోనూ ఆటంకం రాదనీ, అన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయని పెద్దలు అంటారు. మ‌రి చవితి రోజు పూజా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇంటిని శుభ్రం చేసి, తలారా స్నానం ఆచ‌రించి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి. ఇంటిని అలంకరించాలి. 


ఓ పీటకు పసుపు రాసి, దానిపై కొన్ని బియ్యం వేసి, వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి. పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాళ్లు కట్టి వేలాడదీయాలి. పాలవెల్లికి పుష్పాలు, కాయలు, పండ్లు అందంగా అలంకరించాలి. వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములంటే ప‌ర‌మ ప్రీతి. వీటితో పాటు అనేక ర‌కాల పిండి వంటలు చేసుకోవాలి. 


వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రతో కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత పసుపు ముద్దతో పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. ఇక స్వామివారికి పూజ చేసే సామాగ్రి, గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి, ఉండ్రాళ్ళు, కుడుముల‌తో పాటు మొద‌ల‌గు పిండి వంట‌ల‌ను నైవేద్యంగా సమర్పించవలెను.  విన‌య‌కుడి కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. అలాగే చవితి రోజున అక్షింత‌లు వేసుకోకుండా చంద్రుణ్ణి చూడడం దోషం.



మరింత సమాచారం తెలుసుకోండి: