గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 12 న నిర్వహించే గణేష్ విగ్రహాల శోభాయాత్ర మరియు నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సంస్థ చేపడుతున్న ఏర్పాట్లను దక్షిణ తెలంగాణ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  గౌరవరం రఘుమా రెడ్డి సమీక్షించారు. గురువారం అయన  గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులతో  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 
గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే 44 చెరువులు/ కుంటల వద్ద నిరంతర  విద్యుత్ సరఫరా కోసం 27 నం. 500 కె వి ఏ, 38 నెం 315 కె వి ఏ, 12 నెం.160 కె వి ఏ, 4 నెం.  100 కె వి ఏ విద్యుత్ పంపిణి ట్రాన్సఫార్మర్లను, 42 కిలోమీటర్ల ఎల్ టి కేబుల్, యుజి  కేబుల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.  దీనికి తోడు రోడ్ క్రాసింగ్లు, వదులుగా ఉన్న తీగలను సరి చేయనున్నట్టు తెలిపారు.





ట్రాన్సఫార్మర్ల వద్ద ఎర్తింగ్, అవరమైన చోట ఇన్సులేషన్ ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్టు సీఎండీ వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం లో సర్దార్ మహల్, హుసైన్ సాగర్, బషీర్ బాగ్, గాంధీనగర్, సరూర్ నగర్ వంటి ఇతర ప్రాంతాల్లో 9 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించే నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పర్యవేక్షించుటకు సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ జె శ్రీనివాస రెడ్డి ఇంచార్జి గా వ్యవహరిస్తారని సీఎండీ తెలిపారు.        
సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు తమ పరిధిలోని  పెద్ద విగ్రహాలు ప్రతిష్టించిన మండపాలను, ఆ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే వీధులను, రహదారులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్ భద్రత పై దృష్టి పెట్టిన  సీఎండీ క్రింది సూచనలు చేశారు.
1 . సెక్షన్ ఆఫీసర్స్ తమ పరిధిలోగల గణేష్ మండపాలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని, విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, మండప నిర్వాహుకుడి వివరాలు, ఆ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించే దారి వంటి వివరాలన్ని కలిగి వుండాలన్నారు.  
2 .ప్రతి మండపం వద్ద ఒక ఉద్యోగిని నియమించాలని, విగ్రహం నిమజ్జనం పూర్తయ్యేవరకు విగ్రహం వెంటే ఉండాలని లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేయాల్సిందిగా తెలిపారు
3.రహదారులకు అడ్డంగా నున్న ఎల్ టి/ 11  కేవీ విద్యుత్ తీగలు తొలిగించాలని, ఒక వేళ కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ వంటి తీగలు అడ్డంగా నున్నంచో అవి తొలగించాల్సిందిగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలి. 
4.ఇనుప స్తంభాలకు కొంత ఎత్తు వరకు PVC పైపులను అమర్చాలని, ట్రాన్సఫార్మర్ల వద్ద ఫీడర్ పిల్లర్ బాక్సులకు అపాయం అని తెలియజేసే రేడియం స్టిక్కర్లు అమర్చాలన్నారు. 
5. ప్రతి ఓ&ఎం సిబ్బంది వద్ద హెల్మెట్, ఎర్త్ రాడ్, టాంగ్ టెస్టర్, గ్లౌసెస్, వాకి టాకీ, ఇన్సులేషన్ టేప్, రైన్ కోట్ వంటివి తప్పని సరిగా ఉండేలా చూడాలి.
6. సెక్షన్ అధికారులు తమ పరిధిలోని విగ్రహాలు నిమజ్జనం అయ్యే వరకు మండప నిర్వాహుకులు, పోలీస్ వారితో సమన్వయము చేసుకుంటూ ఉండాలి. విద్యుత్ సంబంధించి ఎలాంటి ప్రమాదాలు కలగకుండా అప్రమత్తంగా ఉండాలి.
7. ముఖ్యమైన నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన జెనెరేటర్ వాటి కనెక్షన్లను సైతం పరిశీలించి, ఎలాంటి లీకేజ్ లు లేకుండా ఇన్సులేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల శోభాయాత్ర సజావుగా నిర్వహించేందుకు సంస్థ తగు ఏర్పాట్లు చేపడుతుందన్నారు. మండప నిర్వాహకులు, ప్రజలు విద్యుత్ భద్రత సూచనలు పాటిస్తూ, తమ శాఖ వారికి సహకరించాలని సీఎండీ కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు  టి శ్రీనివాస్, జె శ్రీనివాస రెడ్డి,  కె రాములు,  జి పర్వతం,  సి హెచ్. మదన్ మోహన్ రావు,  ఎస్ స్వామి రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ సీజీఎంలు, ఎస్ ఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: