సెప్టెంబర్ 12వ తేదీన జరగనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద పరిశీలించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిలతో పాటు వివిధ శాఖల అధికారులతో నిమజ్జన ఏర్పాట్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైందని, ఈ నెల 12న జరిగే ప్రధాన నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా నగర ఖ్యాతిని మరోసారి పెంపొందించేందుకు ప్రతిఒక్కరం సమన్వయంతో  కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ ప్రత్యేకతను కాపాడటానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ లో దాదాపు 50వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతాయని,  ప్రధానంగా నిమజ్జన కార్యక్రమం సందర్భంగా శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసి, విద్యుత్, పోలీసు, రోడ్లు, భవనాలు, జలమండలి తదితర శాఖలు  ప్రత్యేక చర్యలు చేపట్టాయని మంత్రి పేర్కొన్నారు. నగరంలో ప్రధానంగా 162కిలోమీటర్ల మార్గంలో ఈ గణేష్ శోభాయాత్ర జరుగుతుందని, ఈ మార్గంలో రోడ్ల మరమ్మతులు, ఇతర సౌకర్యాలను, ప్రత్యేకంగా అదనపు లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.






గత సంవత్సరం మాదిరిగానే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఉదయం వేళలోనే నిమజ్జనం చేసేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని తెలిపారు. ఈ సారి ఖైరతాబాద్ భారీ వినాయకుడు ట్యాంక్ బండ్ లో పూర్తిగా మునిగే విధంగా నిమజ్జన ప్రాంతంలో లోతుగా తవ్వకాలను ప్రారంభించినట్టు తలసాని పేర్కొన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శోభయాత్ర జరిగే రహదారులలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్టు వివరించారు. ప్రత్యేక శానిటేషన్ బృందాలను ఏర్పాటుచేసి నిమజ్జన శోభయాత్ర మార్గంలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నామని అన్నారు. ట్యాంక్‌బండ్‌పై గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి ప్రత్యేక  క్రెయిన్‌లు ఏర్పాటు చేస్తున్నందున ప్ర‌తి మూడు క్రెయిన్‌ల ఎంట‌మాల‌జి సిబ్బందిని నియ‌మిస్తున్న‌ట్టు చెప్పారు. వినాయక మండపాల వద్ద ఏవిధమైన అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు బ్లీచింగ్ పౌడర్, లైన్ పౌడర్‌ను త‌గు మొత్తంలో అందుబాటులో ఉంచిన‌ట్టు క‌మిష‌న‌ర్ అన్నారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌నం జ‌రిగే మార్గంలో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు, రాళ్లు, ఇత‌ర వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డానికి ఆయా స‌ర్కిళ్ల‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ఇంజ‌నీరింగ్ విభాగం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేప‌డుతుంద‌ని చెప్పారు.






నిమ‌జ్జ‌న ప్రాంతాల్లో ప్ర‌త్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని, ట్యాంక్‌బండ్‌తో పాటు ఇత‌ర ప్ర‌ధాన మార్గాల్లో తాత్కాలిక మ‌రుగుదొడ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.  సెప్టెంబ‌ర్ 7 నుండి 12వ తేదీ వరకు నిరంత‌రం నిమ‌జ్జ‌నాలు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. ప్ర‌ధాన దేవాల‌యాలు, గ‌ణేష్ మండ‌పాలు, నిమ‌జ్జ‌న ప్రాంతాల‌కు దారితీసే అన్ని ర‌హ‌దారుల‌ను పూర్తిస్థాయిలో మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్ట‌డంతో పాటు మార్గ‌మ‌ధ్యలో అడ్డుగా ఉండే చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. 12వ తేదీన శోభ‌యాత్ర జ‌రిగే ప్ర‌ధాన ర‌హ‌దారుల‌లో మంచినీటి వ‌స‌తి, పారిశుధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని, అద‌న‌పు తాత్కాలిక మ‌రుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నట్టు మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ జె.శంకరయ్య, డిప్యూటి కమిషనర్ గీతారాధిక, విద్యుత్ ఇ.ఇ వేణుమాధవ్, జలమండలి, హెచ్.ఎం.డి.ఏ, ట్రాఫిక్, పోలీసు, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: