వినాయక నిమజ్జనానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్ శోభాయమానంగా ముస్తాబవుతోంది. ఎప్పుడూ లేనంత ఎక్కువ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని అంచనా వేస్తున్న అధికారులు. అందుకు తగ్గట్టే భారీ ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఏర్పాట్లకు రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ... రోడ్లపై చెట్ల కొమ్మలతో పాటు.. అడ్డుగా ఉన్న వైర్లు, బ్యానర్లను తొలగించి.. విగ్రహాల తరలింపు సజావుగా జరిగేలా చేశారు. 


నవరాత్రుల వేళ నగరమంతా ఎటు చూసినా వాతావరణం శోభాయమానంగా కనిపిస్తోంది. నిమజ్జన కోలాహలంతో.. ట్యాంక్‌ బండ్‌కు భారీగా విగ్రహాలు తరలుతున్నారు. నిమజ్జనాలకు వచ్చే భక్తులతో పాటు వేడుక చూసేందుకు సందర్శకులు సైతం పెద్ద సంఖ్యలో ట్యాంక్‌బండ్ వద్దకు పోటెత్తుతున్నారు.  అధికారికంగానే నగరంలో ఈ సారి మొత్తం 55 వేల మండపాలు వెలిశాయి. అనధికారికంగా మరో 10వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో.. గణేశ్ నిమజ్జనం భారీ స్థాయిలో జరగనుంది. జి.హెచ్.ఎం.సి, పోలీస్, రోడ్డు భవనాల శాఖ, విద్యుత్ శాఖ, వాటర్ బోర్డ్, హెచ్.ఎమ్.డి.ఎ లాంటి శాఖలు, విభాగాలన్నీ కలిసి సమన్వయంతో పనిచేస్తూ.. నిమజ్జనంలో ఒక్క లోపం కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  


నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతులు తలెత్తకుండా... ఏకంగా 21వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో ఎలాంటి సమస్యలూ రాకుండా ఉండేలా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన అంశాల్ని స్వయంగా పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.  


నిమజ్జనం ఏడాదంతా చెప్పుకునేలా.. విద్యుత్ శాఖ చాలా చోట్ల భారీ లైటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. రోడ్లు భవనాల శాఖ... ట్యాంక్ బండ్ దగ్గర, ఎన్టీఆర్ మార్గ్‌లో పెద్ద పెద్ద క్రెయిన్‌లను ఏర్పాటు చేస్తోంది. గతేడాది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని ఉదయాన్నే తరలించడం వల్ల మధ్యాహ్నానికే... ఆ విగ్రహ నిమజ్జనం పూర్తైంది. రాత్రి పూట అన్ని విగ్రహాల నిమజ్జనం కూడా అయిపోవడంతో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. దీంతో.. ఈసారి కూడా అదే విధంగా... 61 అడుగుల ద్వాదశ ఆదిత్య మహా గణపతిని ఉదయాన్నే తరలించాలని నిర్ణయించారు నిర్వాహకులు. సాయంత్రానికి కార్యక్రమం పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు.. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గణేశుడి దర్శనానికి భక్తులు  పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండడంతో.. అక్కడ జనసందోహం ఏర్పడింది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మెట్రో ట్రైన్స్‌ కిక్కిరిసిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: