తిరుమలలో శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు ఏటికేడాది పెరుగుతున్నాయి. బంగారం... వెండి కానుకలతో రికార్డుల మోత మోగుతోంది. గత ఐదు నెలల కాలంలోనే శ్రీనివాసుడికి కళ్లు చెదిరిపోయేలా కానుకలు వచ్చాయి. భక్తుల కొంగు బంగారమైన శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో కానుకలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయ్. 


కలియుగ వైకుంఠం తిరుమలలో వెంకటేశ్వరస్వామికి భారీగా కానుకలు వస్తున్నాయి. ఆపద మొక్కుల వాడికి పెద్దమొత్తంలో కానుకలు సమర్పిస్తున్నారు భక్తులు. తిరుమలలో శ్రీనివాసుడిని దర్శించుకొని తమ కోరికలు తీర్చమని భక్తులు వేడుకుంటారు. ఇక... కోరికలు తీరిన తర్వాత...స్వామి వారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు క్యూకడుతున్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. గతంలో స్వామివారి దర్శనానికి సాధారణ రోజుల్లో 25 వేల మంది వస్తుండేవారు. అదే సెలవు రోజుల్లో ఆ సంఖ్య 50 వేలకు మించేదికాదు. కానీ ఇప్పుడు సాధారణ రోజుల్లోనే 65 వేల మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు. సెలవు రోజుల్లోనైతే ఏకంగా లక్ష మందికి తగ్గకుండా తిరుమలకు వస్తున్నారు. దీంతో శ్రీవారికి లభించే కానుకలు కూడా భక్తుల సంఖ్యను బట్టే  పెరుగుతున్నాయి. 


20ఏళ్ల కిందటి వరకు శ్రీవారికి ఏడాదికి లభించే హుండీ ఆదాయం 100కోట్లు మాత్రమే ఉండేది. అది ఇప్పుడు ఏకంగా వేల కోట్లకు చేరుకుంది. ఏడాదికి ఏకంగా 1300 కోట్లకు చేరింది. ఒక్క ఏడాదిలోనే బంగారం వెయ్యి కేజీలు, 8 వేల కేజీల వెండిని భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. కలియుగ వైకుంఠనాథుడి ప్రాశస్త్యం దశదిశలా వ్యాపిస్తోంది. శ్రీవారి వైభవం అంతే స్థాయిలో పెరుగుతూ వస్తోంది అంటున్నారు ప్రధాన అర్చకులు.


ఇక శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు ఏటికేడాది పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 5 నెలల్లోనే కానుకలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు టీటీడీ నిర్వహిస్తున్న పథకాలకు 114 కోట్ల విరాళాలు సమకూరాయి. ఈ ఏడాది ఇప్పటికే 140 కోట్లకు చేరుకున్నాయి. ప్రధానంగా అన్నప్రసాద పథకానికి 65 కోట్లు... బాలాజీ ఆరోగ్య వరప్రసాదానికి 23.70 కోట్లు, ప్రాణదానానికి 10.4 కోట్ల ఆదాయం విరాళాల రూపంలో అందించారు భక్తులు. గత ఏడాది 5 నెలల కాలంలోనే 1128 కేజీల వెండి హుండీ ద్వారా లభించింది. ఈ ఏడాది  రికార్డు స్థాయిలో 3098 కేజీల వెండిని సమర్పించారు భక్తులు. అత్యధికంగా మే మాసంలో 1267 కేజీల వెండిని సమర్పించారు. ఇక 5 నెలల కాలంలోనే 344 కేజీల బంగారాన్ని సమర్పించారు భక్తులు. ఈ ఏడాది ఇదే కాలంలో 524 కేజీల బంగారాన్ని సమర్పించారు. మరోవైపు హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 450.54 కోట్ల రూపాయల హుండి ఆదాయం శ్రీవారికి లభించింది. ఈ ఏడాది ఇదే కాలంలో 497.29 కోట్ల ఆదాయం స్వామి వారి సొంతమైంది. ఇలా గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతున్నాయి. శ్రీవారి వైభవం దశదిశలా వ్యాపిస్తోందని చెప్పటానికి వచ్చే కానుకలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: