కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌ర్ 8వ తేదీ వరకు  సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ  బ్రహ్మోత్సవాల్లో భాగంగా  సెప్టెంబరు 24వ తేదీ మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు.



అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు. సెప్టెంబరు 24వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని అష్టదళ పాదపద్మారాధన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి రద్దు చేసింది.



శ్రీవారి వాహనసేవలను పరిశీలిస్తే.. ఈ వేడుకలను నిర్ణేత సమయాల్లో ఉదయం, సాయంత్రం నిర్వహిస్తారు.  సెప్టెంబర్ 30 వ తేదీన  ధ్వజారోహణం వేడుకను నిర్వహిస్తారు. సా..5.23 నుండి 6 గం. మధ్య మీన లగ్నంలో పెద్దశేషవాహనం ఉత్సవం జరుగుతుంది. అక్టోబర్ 1 వ తేదీన  చిన్నశేష వాహనం , హంస వాహనం సేవలను నిర్వహిస్తారు. అక్టోబర్ 2 వ తేదీన సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం సేవోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. 3 న  కల్పవృక్ష వాహనం, స‌ర్వభూపాల వాహనం సేవలను చేపడతారు. 4 న మోహినీ అవతారం,  గరుడ వాహన ఉత్సవాలను నిర్వహిస్తారు. 5 న హనుమంత వాహనం, స్వర్ణరథం, గజవాహనం సేవలు ఉంటాయి. 6 న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనాలపైనా శ్రీవారి సేవలను నిర్వహిస్తారు. 7 న రథోత్సవం, అశ్వ వాహనం పైన, 8 న  చక్రస్నానం వేడుక, ఆ సాయంత్రం  ధ్వజావరోహణం ఉత్సవం జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: