"సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే" ఈ శక్తి కనుక లేకుంటే! శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" యని ఆదిశంకరాచార్యుల వారు "అమృత వాక్కు" లో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రికి ప్రతి రూపం అని, పరమేశ్వరుడు పగలుకి ప్రతి రూపం  రూపం అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే! సర్వ పాపాలు నాశనమౌతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం మనకు తెలియచెస్తోంది.

 

ఎందరో మహా యోగులు మునులు సిద్ధులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టియందుగల చరాచర వస్తువులన్నిటియందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగిఉంది. ఈ సృష్టి యందు జనించి నిక్షిప్తమైన,  జ్యోతిర్మండల, వాయువు జలం అగ్ని ఆకాశం పృధ్వి లాంటి పంచ భూతాలు ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢిగా అందురూ ఆమోదించే విషయం.


ఆ మహా మహితాత్మక శక్తినే పరాశక్తిగాను, జగన్మాతగాను పలు పేర్లతో రూపాలతో  పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రి పర్వదినాలలో ఏనోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.


 Image result for durga sapta Sati slokam in telugu


దేవతలు భండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షించుటకుకొనుటకు, ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గము లేదని తలచి ఆ మహాశక్తికోసం మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండ మందు వారి శరీరభాగాలను ఖండించుకుని ఆహుతిచెయ్యగా, ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురు ని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.

Related image 

ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుని వధించింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా

1  శైలపుత్రి

2 బ్రహ్మచారిణి

3 చంద్రఘంట

4 కూష్మాండ

5 స్కందమాత

6 కాత్యాయనీ

7 కాళరాత్రి

8 మహాగౌరి

9 సిద్ధిధాత్రి


అను రూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది. తొలుత ఈ దేవదేవి "శ్రీ కృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలలో పూజలందుకుంది. "బ్రహ్మ"కైటభుల బారి నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందినాడు.


"పరమేశ్వరుడు" త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు.

"దేవేంద్రుడు" దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందకలిగినాడు.


ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షం పాడ్యమి, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈ దేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణ ఉవాచ. అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు.

 

అందు మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను,

తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను,

చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధనతో జ్ఞానాన్ని పొందాలి. 

 

నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు . ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.

 

ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని ఒక విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితా దేవిని పూజించి ఈ శ్లోకంతో

 

"శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ"  అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి.

 

ఇలా ఈ జగన్మాత మానవులను తీర్చిదిద్ది (మ=మాయ, న=లేకుండా, వ=వర్తింప చేసి) తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము. శ్రీరామచంద్రుడు విజయదశమి, విజయకాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించుటవల్ల ఆ శమీవృక్షము, "రామస్య ప్రియదర్శిని" అయినది అని అంటారు. అందువలన భారతీయులంతా దీనిని విజయ ముహూర్తంగా పరిగణిస్తారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: