భారత స్టార్ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు బతుకమ్మ సంబరాల్లో సందడి చేసింది. హైదరాబాద్‌ నగరం అంబర్‌పేట్‌ మున్సిపల్‌ మైదానంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో సింధు పాల్గొంది. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న సింధు అక్కడి మహిళలతో కలిసి ఆడిపాడింది. తెలుగు ప్రజలందరికి సింధు దసరా శుభాకాంక్షలు తెలిపింది. అంబర్‌పేట్‌ మున్సిపల్‌ మైదానంలో గత సంవత్సరం నిర్బహించిన బతుకమ్మ వేడుకల్లో భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ పాల్గొంది.

పీవీ సింధు బతుకమ్మ వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి హాజరైంది. కిషన్ రెడ్డి దంపతులు సింధుని సన్మానించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ... 'నన్ను ఇక్కడకు ఆహ్వానించి సత్కరించినందుకు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. దేశ వ్యాప్తంగా అమ్మాయిలు క్రీడల్లో రాణించాలని కోరుకుంటున్నా. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 'భేటీ హచావోభేటీ పడావో' కార్యక్రమం అద్భుతం' అని తెలిపింది.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... 'ఇంతటి విశిష్టమైన బతుకమ్మ పండగ తెలంగాణ రాష్ట్రానికే సొంతం. సింధు సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషం. భారత ఖ్యాతిని ప్రపంచం అంతటా చాటిచెప్పిన ఘనత సింధుదే. ఆడపిల్లల రక్షణకు మోడీ ప్రభుత్వం మంచి రక్షణ కల్పించింది' అని అన్నారు. సింధు బతుకమ్మ సంబరాలకు సంబందించిన వీడియో, పోటోలను కిషన్ రెడ్డి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

టీవల స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో జపాన్ షట్లర్ ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో సింధు విజయం సాధించింది. ఈ టోర్నీలో పసిడి పతకం గెలిచిన తొలి భారత షట్లర్‌గా సింధు అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో 2013 నుంచి పోరాడుతున్న సింధుకి దాదాపు ఐదేళ్ల నిరీక్షణ తర్వాత పసిడి పతకం లభించింది. 2017, 2018లో ఫైనల్‌కి చేరిన సింధు.. రజతానికి పరిమితమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: