ఈ ప్రపంచాన్ని ఏదో తెలియని అనంతశక్తి ఒకటి నడిపిస్తున్నది అన్నది సత్యం. సృష్టి ఆవిర్భావానికి ఏ శక్తి అయితే కారణమో అదే శక్తికూడా విశ్వ ప్రళయానికీ కారణభూతమవు తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శక్తినే ఉపనిషత్తులు ‘పరాశక్తి’గా అభివర్ణించాయి. అదే ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా పలు రూపాలుగా సాక్షాత్కరిస్తుందని వేదవిద్వాంసులు అంటారు. నిజానికి ‘ఈ శక్తులన్నీ వేర్వేరా?’ అనే ప్రశ్న ఉదయించవచ్చు. ఏ శక్తికది వేర్వేరుగా కనిపించినా, అన్ని శక్తులూ కలిస్తేనే ఆ అనంత ‘శక్తి’ అవుతుంది. మరి, ఆ మహాశక్తిని ప్రసన్నం చేసుకోవడం మనలాంటి సామాన్యులకు సులభమేనా అంటే వాటికోసం ఏర్పరచిన కొన్ని మార్గాలద్వారా ప్రయత్నిస్తే తప్పక  ఆ మహాశక్తిని ప్రసన్నం చేసుకోవచ్చని ఎందరో పురాణ పురుషులు మనకు నిరూపించారు.


ఇక ఈ జగద్రక్షణకు కేవలం ఇచ్ఛాశక్తి మాత్రమే కాదు, జ్ఞాన, క్రియాశక్తులు మూడూ అవసరం. నిజానికి ‘పరాశక్తి’ జ్ఞానశక్తికి ప్రతిరూపం. ఆమె జ్ఞానస్వరూపిణి. అయితే, ‘ఆమెలో క్రియ ఉందా’ అంటే ‘ఉందనే’ చెప్పాలి. మరి, ఈ క్రియాశక్తి అనే మాటకు అర్థమేమిటి? దీన్నే మనం తెలుసుకోవాలి. ప్రకృతి అంతా ఒక జడపదార్థం. దీనినే ‘క్రియ’కు ప్రతిరూపంగా చెప్పాలి. విశ్వపదార్థం పరిణామం చెందడం వల్లనే మనకు కనిపించే ఈ క్రియాప్రపంచం ఉద్భవిస్తున్నది. అందుకే, వేద పండితులు ‘క్రియ కలిగిన ఈ ప్రపంచమంతా ఎవరి అధీనంలో ఉంటుందో అదే క్రియాశక్తి’ అన్నారు. ఈ విధంగా త్రివిధశక్తులతోకూడిన పరాశక్తి మనతోపాటు సమస్త విశ్వాన్నీ పరిపాలిస్తున్నదని తెలుస్తున్నది.అన్ని ప్రాణులలోను, పంచభూతాలలోను, ఆఖరకు విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఈ పరాశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి విద్వాంసులు వేదకాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అర్హులైన వారు ఆమెను సాక్షాత్కరింపజేసుకొంటున్నారు.


ఇక ఎవరిని చేరటానికి కష్టమో ఆమె పేరే ‘దుర్గ’. ఆమె అన్నివేళలా ఆరాధింపదగింది. తనను శబ్దం ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు. వేదమంత్రాలు, స్తోత్రగ్రంథాలు దీనికి ఉపకరిస్తాయి. అలాగే, ఆమెను ధ్యానం ద్వారానూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇందుకు యోగాభ్యాసం తోడ్పడుతుంది. ఆమెను సమాధిస్థితిలో సైతం దర్శింపవచ్చు. ఇది ఏకాగ్రతతో కూడిన తపస్సువల్ల సిద్ధిస్తుంది.‘సర్వస్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే/ భయోభ్యస్ర్తాహి నోదేవి దుర్గేదేవి నమోస్తుతే’ ॥ అన్నది దుర్గాస్తోత్రం.


జగత్తు అంతటా వ్యాపించి, లోకాలన్నింటికీ ఏలికయై, అనంతశక్తి సమన్వితయై, ప్రాణికోటికి భయం లేకుండా చేసే దుర్గాదేవి మనందరికీ నమస్కరింపదగింది, ఉపాసింపదగింది. జ్ఞానశక్తిని, క్షాత్రశక్తిని, తపోశక్తిని పొందాలనుకున్న వారు ఈ అమ్మవారిని విధిగా ఆశ్రయించక తప్పదు. జ్ఞానశక్తి అందితే దానిద్వారా ఏకంగా ముక్తినే సాధించవచ్చు. క్షాత్రశక్తిని సమీకరించుకొంటే అమ్మవారితోపాటు దేశాన్నికూడా రక్షించుకోవచ్చు. అదెలా జరుగుతుందన్నదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం..కాని ఒక్కటిమాత్రం నిజం నిద్రాణంగా ఉన్న మనలోని శక్తులను మేల్కొలిపి తద్వారా మనం శక్తిమంతులం కావడానికే ఈ శక్త్యారాధన ఉపయోగపడుతుందని చెప్పగలం.!

మరింత సమాచారం తెలుసుకోండి: