నవరాత్రులను నవ అహో రాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. నవ రాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది.ఇక నవరాత్రులు అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు. ఈకాలంలో నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే  శరన్నవరాత్రులు లేదా  దేవి నవరాత్రులు అంటారు...


నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం, అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. ఈ సమయంలో పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. కాబట్టి తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం తప్పక లభిస్తుందని పురాణం చెబుతుంది. ఇక దుర్గాష్టమి కాల చక్రంలో ఆశ్వయుజ మాసంలో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల మనషుల ఆరోగ్యానికి ప్రాణ హాని కలిగించే అనేక దుష్టశక్తులు విజృంభిస్తుంటాయి.


పురాణాల ప్రకారం ఈ కాలంలో శరత్ వసంత అనే ఇద్దరు రాక్షసులు వివిధ రోగాలకు కారకులుగా మారుతారట. ఈ ఋతు పరివర్తన సమయంలో జ్వరాలు, విషజ్వరాలు, కఫం దగ్గు మొదలైన ఉపద్రవాలను నివారించటానికి అనాదిగా దుర్గా పూజా విధానం ఆచరణలో ఉంది. ఈ సమయాన్ని దేవి మహా గౌరిగా దర్శనమిచ్చే రోజుగా చెబుతారు. ఈ అష్టమికే, కాలికాష్టమి అనే మరో పేరు కూడా ఉంది. ఈ రోజు దుర్గా అష్టోత్తరం, సహస్ర నామాలు చదువుతూ అమ్మవారి ని పూజించి. దేవికి దానిమ్మ పండ్లు, పొంగలి, పులోహోర నివేదన చేయాలి.


ఇకపోతే కుజ గ్రహ దోష జాతకులు దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించడం చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. మహర్నవమి - నవరాత్రులలో ప్రధానమైన రోజు దేవి మహిషుడిని సంహరించిన రోజు. మహిషాసుర మర్దిని రూపం లో మహా శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎరుపురంగు పూలు, జమ్మి పూలు, కనకాంబరాల తో పూజించి పొంగలి,పులిహోర, అరటి పండ్లు నివేదించడం మంచిది.


ఇకపోతే మనిషి మనసులో వున్న చెడుభావాలన్ని క్రమశిక్షణ అనే ఆయుధంతో ఖండించి మానవ సేవనే మాధవ సేవ అని భావిస్తూ అమ్మవారిని పూజిస్తే జన్మ జన్మలకు పుణ్యఫలాలను స్వీకరించవచ్చూ. మాయ ఎక్కడో లేదు అది నీ మనసులోనే వుందని గ్రహిస్తే ప్రతివారు మాధవుడిగా మారవచ్చు అనే సత్యాన్ని గ్రహిస్తే చాలు లోకం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెబుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: