దసరా పండుగ భక్తులు విజయం అందించే పండుగ. మంచివారికి ఎప్పుడూ విజయం దక్కతుందని విశ్వాసం కలిగించే పండుగ. నవరాత్రుల్లోని తొలి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.


మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవి పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి నాడు పూజ చేస్తే అష్టైశ్వర్యాలతో కూడిన సుఖజీవితం లభిస్తుంది. దుర్గాష్టమి రోజును ఆయుధాలకు, వాహానాలకు పూజ చేస్తారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గా దేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.


పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు.


అందుకే.. తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు. వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఇది విజయం అందించే పండుగ.


మరింత సమాచారం తెలుసుకోండి: