క్రికెట్‌లో ఇప్పటివరకు మీరు ఎన్నో రికార్డులు చూసే ఉంటారు..క్రీడాకారులు బరిలోకి దిగిన తర్వాత విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ రికార్డుల మీద రికార్డులు తమ ఖాతాలో వేసుకుంటారు.  తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన విల్‌ జాక్స్‌ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు.  స్టేడియంలో ఉండే అభిమానులు ఉత్కంఠంగా చూస్తున్న ఈ క్రీడ వారిలో నూతనోత్తేజాన్ని తీసుకు వచ్చింది. 

టీ10 మ్యాచ్‌లో భాగంగా సర్రే జట్టుకు ఆడుతున్న జాక్స్.. లాంక్‌షైర్‌ జట్టు బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు.  ఆది నుంచి బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన జాక్స్‌ పరుగుల వరద పారించాడు.  ముఖ్యంగా ఇన్నింగ్స్ 5వ ఓవర్‌ ఆరంభానికి ముందు వ్యక్తిగత స్కోరు 62 వద్ద ఉన్న ఈ హిట్టర్..  ఆ ఓవర్ ముగిసే సమయానికి 98 పరుగులతో నిలిచాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం మైలురాయిని అందుకున్న జాక్స్.. ఆ తర్వాత 25 బంతుల్లో శతకం మార్క్‌ని చేరుకోవడం విశేషం.

30 బంతుల్లో 105 పరుగులు చేసిన అనంతరం జాక్స్‌ ఔటయ్యాడు.  మొత్తం 11 సిక్స్‌లు, 8 ఫోర్లతో కేవలం 30 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు జాక్స్. దీంతో అతడు ఆడుతున్న సర్రే టీమ్ పది ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగుల భారీ స్కోరు చేసింది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు అధికారిక హోదా ఇచ్చి ఉంటే.. ఐపీఎల్‌లో 30 బంతుల్లో సెంచరీ కొట్టిన క్రిస్ గేల్ రికార్డు మరుగున పడేది. ఇటీవల తిరువనంతపురం వేదికగా భారత్‌-ఎ జట్టుతో తలపడిన ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టులో జాక్స్‌ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: