బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బౌలర్ కౌల్టర్‌ నీల్‌ వేసిన ఓవర్లో ధావన్ ఎడమచేతి బొటన వేలికి బంతి బలంగా తాకడంతో గాయమైంది. నొప్పిను భరిస్తూనే సెంచరీ సాధించిన ధావన్ జట్టు భారీస్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. వేలి నొప్పితో ధావన్ ఫీల్డింగ్‌కు రాకుండా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. ధావన్ వేలికి స్కానింగ్ తీసిన డాక్టర్లు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ధావన్ ప్రపంచకప్ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాక్టర్ల సూచనల మేరకు జూన్ నెల మొత్తం ధావన్ విశ్రాంతి తీసుకోనున్నాడు.

అందువల్ల లీగ్‌‌లో మిగతా జట్లతో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇండియా సెమీస్‌కు చేరితే మాత్రం ధావన్ తిరిగి బ్యాట్ పట్టే అవకాశముంది. ఇప్పుడు టీమిండియా జోరు చూస్తుంటే సెమీస్ చేరడం పక్కా. అందువల్ల ధావన్ ప్రపంచకప్‌కు పూర్తి దూరం కాలేదనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఓపెనింగ్ పంపాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వన్డే ప్రపంచకప్‌లో రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న టీమిండియాకు షాక్. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ప్రపంచకప్‌ నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అద్భుత శతకం సాధించిన ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ మెగా టోర్నీలో నాలుగో స్థానం కోసం సెలెక్టర్లు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు అతడు ఓపెనర్‌గా బరిలో దిగితే నాలుగో స్థానం ఖాళీ ఏర్పడుతుంది. దీంతో ఆ స్థానం కోసం రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్‌లో ఒకరిని తీసుకోవాలని యోచిస్తున్నారు. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
ఇతర సిరీస్‌ల్లో తన ఫామ్ ఎలా ఉన్నా ఐసీసీ టోర్నీల్లో మాత్రం ధావన్ రెచ్చిపోతుంటాడు.

గత కొంతకాలంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అతడు ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో జట్టు అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముచ్చటగా మూడోసారి కప్పు అందుకోవాలని ఆశపడుతున్న భారత్‌కు ధావన్ గాయం పెద్ద షాకే అని చెప్పొచ్చు. అతడు లేని లోటు ఎవరు తీరుస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: