సినిమా అయినా, రాజకీయమైనా, వ్యాపారమైనా, క్రీడలైనా.. ఏ రంగం తీసుకున్నా సమఉజ్జీల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరమే. చూసే వారికి ఉత్సాహాన్ని కూడా కలిగించే ఇటువంటి పోరు మధ్య ఉండే ఆసక్తే వేరు. ఇటువంటిదే రేపు జరుగబోతున్న ఇండియా-పాకిస్థాన్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్. దాయాదులు అనే పదానికి అసలు సిసలు అర్ధాన్ని ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ కల్పిస్తుంది. ఇప్పటి వరకూ వరల్డ్ కప్ క్రికెట్ లో ఈ రెండు దేశాలు 6సార్లు తలపడ్డాయి. రెండు దేశాల్లోని ప్రజలు క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా వారి మదిలో ఒక యుద్ధంగానే భావిస్తారు. సామాన్యుల దగ్గరనుంచి దేశాధినేతల వరకూ ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ జరిగే రోజంగా ఉద్విగ్నంగానే గడుపుతారంటే అతిశయోక్తి కాదు. వేసే ప్రతి బాల్, కొట్టే ప్రతి షాట్ కూడా వేటాడే పులి పంజాలానే ఉంటాయి. ఇటువంటి రణానికి ఇప్పుడు జరుగుతున్న ఇండో-పాక్ క్రికెట్ మరోసారి తెరలేపింది.


ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య జరిగిన 6 మ్యాచ్ లలో భారత్ దే పైచేయి అయింది. ఇన్న మ్యాచ్ లలో మైదానంలో కూడా యుద్ధ వాతావరణమే జరిగింది. ఆటగాళ్ల మధ్య ఉద్వేగం, చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్సాహం, ఆందోళన వీరిద్దరి మధ్య క్రికెట్ ను ఆ క్షణంలో యుధ్దంగా మార్చేస్తుంది. ఇందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. 1992లో కిరణ్ మెరే-జావెద్ మియాందాద్, 1996లో వెంకటేశ్ ప్రసాద్-అమీర్ సొహాయిల్ ఉదంతాలను ఎవరూ మరచిపోరు.


ఇవే కాకుండా మిగిలిన టోర్నీల్లో ఎప్పుడు భారత్-పాక్ తలపడినా కూడా ఏదో ఒక ఘర్షణ వాతావరణం జరుగుతూనే ఉంటుంది. 2003 వరల్డ్ కప్ లో ఇటువంటి ఘర్షణలేమీ జరక్కపోయినా ఈ రెండు దేశాలు తలపడిన మ్యాచ్ లో సచిన్ వర్సెస్ పాకిస్తాన్ అన్నట్టుగా సాగింది. ఆ మ్యాచ్ లో సచిన్ శివతాండవమే చేశాడు. అక్తర్, అక్రమ్, వకార్ లాంటి ఉద్దండుల బౌలింగ్ ను చీల్చిచెండాడిన తీరు ఇప్పటికీ ఒక మధురానుభూతే. ఆ మ్యాచ్ లో ప్రతి బాల్ ఒక మిసైల్. 2007లో కాన్పూర్ లో గంభీర్-ఆఫ్రిదీ ఒకరి మీదికి ఒకరు వెళ్లే పరిస్థితే వచ్చింది. ఇలా ఏదొకటి జరుగుతూనే ఉన్నాయి.


ఇప్పుడు 2019లో మరి ఏ పరిస్థితులు ఉండబోతున్నాయో, రెండు దేశాల మధ్య మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాల్సిందే. రెండేళ్ల నుంచి తీసుకుంటే రెండు దేశాల మధ్య దాదాపుగా యుధ్ద వాతావరణమే జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ మ్యాచ్ ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తుందో, భారత్ తన రికార్డును పదిలపరచుకుంటుందో, పాకిస్థాన్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: