తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్ మెంట్ ప్రకటించేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు అంబటి రాయుడు ప్రకటించాడు. ప్రపంచ కప్ లో ఆడే అవకాశం దక్కకపోవడంతో కొన్నాళ్లుగా మనస్తాపంతో ఉన్న అంబటి చివరకు రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు.


వాస్తవానికి శిఖర్ ధావన్ గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకున్నప్పుడు అంబటి రాయుడుకు ఆడే అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. రాయుడు కూడా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు సెలెక్టర్లు రిషబ్ పంత్ కు అవకాశం ఇచ్చారు.


ఆ తర్వాత విజయ్ శంకర్ కూడా గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఈసారైనా తనకు ఛాన్స్ వస్తుందని అంబటి ఆశించాడు. కానీ ఈసారీ కూడా సెలెక్టర్లు అంబటిని కరుణించలేదు. మయాంఖ్ అగర్వాల్ కు అవకాశం ఇచ్చారు.


దీంతో ఈ ప్రపంచ కప్ లో ఆడే అవకాశాలు లేవని మనస్తాపానికి గురైన అంబటి రాయుడు రిటైర్ మెంట్ ప్రకటించేశాడు. సెలెక్టర్ గా తెలుగు వాడైన ఎమ్మెస్కే ప్రసాద్ ఉన్నా.. అంబటికి న్యాయం జరగలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


క్రికెట్‌ కెరీర్‌లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1,694 పరుగులు చేశాడు. 6 టీ20లు ఆడి 42 పరుగులు సాధించాడు. 2013 జులై 24న టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన వన్డేల్లో మొదటి సారి ఆడిన రాయుడు.. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో తన చివరి వన్డే ఆడాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: