ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ నయా రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్‌ కీపర్‌గా లాథ‌మ్ నిలిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో లాథ‌మ్ ఏకంగా మూడు క్యాచ్‌లు ప‌ట్టి... ముగ్గురు కీల‌క బ్యాట్స్‌మెన్స్‌ను అవుట్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.


ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక మందిని పెవిలియన్‌కు పంపిన కీపర్‌గా ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్‌(ఆస్ట్రేలియా) సరసన చేరాడు. ఈ క‌ప్‌లో లాథ‌మ్ మొత్తం 21 మందిని అవుట్ చేయ‌డంలో భాగ‌స్వామి అయితే... 2003 వరల్డ్‌కప్‌లో అప్ప‌టి ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ ఆడ‌మ్ గిల్‌ క్రిస్ట్‌ కూడా సరిగ్గా 21 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు. దీంతో ఇప్పుడు లాథ‌మ్ కూడా గిల్‌క్రిస్ట్ స‌ర‌స‌న చేరిన‌ట్ల‌య్యింది.


ఈ జాబితాలో గిల్‌ క్రిస్ట్‌, లాథమ్‌ల తర్వాత స్థానాల్లో అలెక్స్‌ క్యారీ(20, 2019 వరల్డ్‌కప్‌), కుమార సంగక్కర (17, 2003 వరల్డ్‌కప్‌)లు ఉన్నారు. ఇక ఫైన‌ల్ మ్యాచ్‌లో లాథ‌మ్ 47 ప‌రుగులు కూడా చేసి తృటిలో అర్థ‌సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లాథ‌మ్ జేసన్‌ రాయ్‌, జో రూట్‌, క్రిస్‌ వోక్స్‌ క్యాచ్‌లను  అందుకున్నాడు. ఈ మ్యాచ్ టై కాగా... ఆ త‌ర్వాత జ‌రిగిన సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అవ్వ‌డంతో చివ‌ర‌కు ఎక్కువ బౌండ‌రీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: