యాషెస్ సిరీస్ లో భాగంగా  ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న  తొలి టెస్ట్ మ్యాచ్  మొదటి రోజు   ఇంగ్లాండ్ స్వల్ప ఆధిఖ్యతను ప్రదర్శించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్నఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి బెంబేలెత్తి పోయింది.  35 పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయి  కష్టాల్లో పడింది. ఈ క్రమంలో  స్మిత్ , ట్రెవిస్ హెడ్  ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయితే  కుదురుకున్నట్లు కనిపించిన  ట్రెవిస్ హెడ్  35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వోక్స్ బౌలింగ్ లో  అవుట్ అయ్యాడు.  దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. 
 
ఆతరువాత  వచ్చిన  వేడ్ , కెప్టెన్ పైని , ప్యాటిన్సన్, కమ్మిన్స్  వెను వెంటనే పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే  మరో వైపు  ఇంగ్లాండ్ బౌలర్లను దాటికి ఎదుర్కొంటూ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు.  సిడిల్ తో కలిసి  జట్టు స్కోర్ ను 200 దాటించాడు.  ఈ దశలో  44 పరుగుల  వ్యక్తిగత స్కోర్  వద్ద సిడిల్ ను బోల్తా కొట్టించాడు మొయిన్ అలీ. దాంతో స్మిత్ , సిడిల్ ల  అద్భుతమైన భాగస్వామ్యానికి తెరపడింది.  ఆ తరువాత నాథన్ లాయన్ సహకారం తో  
 టెస్ట్ కెరీర్ లో 24 వ సెంచరీ పూర్తి చేశాడు  స్మిత్.  కాగా యాషెస్ సిరీస్ లో అతనికి  9వది.

ఇక సెంచరీ చేసాక దూకుడుగా ఆడిన స్మిత్ 144 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద  బ్రాడ్ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు. దాంతో మొదటి ఇన్నింగ్స్ లో  284 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్ అవుట్  అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్ లో బ్రాడ్ 5 వికెట్లు  వోక్స్ 3 వికెట్లు తీయగా స్టోక్స్ , మొయిన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు.  అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన  ఇంగ్లాండ్ మ్యాచ్ ముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది.  రోరి బర్న్స్ , జాసన్ రాయ్ లు క్రీజ్ లో వున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: