టీమిండియా క్రికెటర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన 15 రోజుల సైనిక విధులను విజయవంతంగా నిర్వర్తించి ఇంటికి తిరుగుపయనమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోనీ  ఏం చేస్తున్నాడంటూ అతని అభిమానులు ఆరాతీయడం మొదలుపెట్టారు. భారత ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ ఆగస్టు 15తో తన కాలపరిమితి ముగియడంతో లేహ్ నుంచి నేరుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి  చేరుకున్నాడు.అక్కడ ధోనీకి అతడి భార్య సాక్షితో పాటు కుమార్తె జీవా ఘన స్వాగతం పలికారు.


అనంతరం ధోనీ ఢిల్లీ నుంచి నేరుగా జార్ఖండ్‌కు వెళ్లకుండా కమర్షియల్ యాడ్స్‌ షూట్స్‌లో భాగంగా కుటుంబంతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ధోనీ మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ స్పష్టం చేశాడు. ముంబైలోని గ్రీన్ వ్యాలీ స్టూడియోలో ధోనీపై రూపొందించిన యాడ్ షూట్‌కు సంబంధించిన ఫోటోని మిహిర్ దివాకర్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోకు "వింటర్ క్యాంపెయిన్ 2019 - ఇండియన్ టెర్రిన్ షూట్" అంటూ కామెంట్ సైతం పోస్టు చేశాడు. ఈ యాడ్ షూట్ పూర్తైన తర్వాత ధోని మంగళవారం మరో యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు.


మోహబాబూ స్టూడియోస్‌లో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవనానీతో కలిసి ధోని ఆ యాడ్ షూట్‌లో సందడి చేశాడు. ఇదిలావుంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు రెండు నెలలు విరామం ప్రకటించి 106 టెరిటోరియల్ ఆర్మీకి చెందిన పారా బెటాలియన్‌తో కలిసి విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో పాటు అక్కడ గార్డ్ విధుల్లో ధోనీ పాల్గొన్నాడు. సుమారు రెండు వారాల పాటు కశ్మీర్‌ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ గార్డ్‌ డ్యూటీలను ధోనీ నిర్వర్తించాడు.అలాగే.. సైనికులతో కలసి ఆటవిడుపుగా ధోనీ వాలీబాల్ కూడా ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ లో అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు.. లేహ్ నగరంలోని ఓ బాస్కెట్ బాల్ కోర్టును క్రికెట్ ఫీల్డ్ గా మార్చి అక్కడి పిల్లలతో కలసి ధోనీ క్రికెట్ కూడా ఆడాడు. కశ్మీర్ లోయలో విధుల్లో భాగంగా యురి, అనంత‌నాగ్‌లను సైతం ధోనీ సందర్శించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: