గాయంతో గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ బుమ్రాపై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ ఆసక్తికర కామెంట్లు చేసింది. వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా తాను జిమ్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి 'కమింగ్ సూన్' అంటూ రాసుకొచ్చాడు. దీనిపై యాట్ సెటైరికల్ గా కామెంట్ పెట్టింది. బుమ్రా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్ సైజ్ లను ప్రస్తావిస్తూ చిన్న పిల్లలు చేసే ఎక్సర్ సైజులు చేస్తున్నావా బుమ్రా.. వాటిని బేబీ వెయిట్స్ అంటారు కదా అంటూ కామెంట్ చేసింది. 


ఇదివరకు విరాట్ కోహ్లీ, ధోనీ లాంటి క్రికెటర్లపై పోస్టులకు యాట్ కామెంట్లు పెడుతూ వార్తల్లో నిలిచేది. కొన్నిసార్లు యాట్ చేసిన కామెంట్లు వివాదంగా కూడా మారగా.. బుమ్రాపై యాట్ పెట్టిన పోస్టుకు అభిమానులు కూడా ఫన్నీ కౌంటర్లు ఇస్తున్నారు
      
దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందు వెన్నునొప్పితో జట్టుకు దూరమైన బుమ్రా ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బెంగళూరులోని క్రికెటర్ల పునరావాస కేంద్రంలో బుమ్రా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాగా తొలుత బుమ్రా గాయానికి శస్త్రచికిత్స అవసరమని భావించినప్పటికీ ప్రస్తుతానికి అలాంటి అవసరం రాకపోవడంతో అతడు ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత బుమ్రా బంగ్లాదేశ్ తో జరుగబోయే సిరీస్ కు కూడా దూరంగా ఉండగా.. వచ్చే ఏడాది టీ 20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో బుమ్రాకు తగిన విశ్రాంతి అవసరమని కూడా టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. 


గత కొంతకాలంగా స్వదేశంతో పాటు విదేశాల్లో జరిగిన టెస్టు సిరీస్ లు, వన్డే సిరీసుల్లో వికెట్ల వేటను కొనసాగిస్తూ అద్భుత  ప్రదర్శన చేస్తున్న బుమ్రా.. టీమిండియ  ఫాస్ట్ బౌలింగ్ దళానికి ప్రధానాస్త్రంగా, విరాట్ కోహ్లీకి నమ్మకమైన బౌలర్ గా ఎదిగాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: