ఇండియా, బంగ్లాదేశ్ టీ20 ఫస్ట్ మ్యాచ్‌పై పొల్యూషన్‌ దెబ్బ పడింది. ఇప్పటికే ఇరు జట్లకు చెందిన ప్లేయర్లు...కాలుష్యంలోనే  ప్రాక్టీస్‌ చేస్తున్నారు. గాయంతోనే రోహిత్‌ బరిలోకి దిగుతుండగా... అటు బంగ్లా ఆల్ రౌండర్ షకీబల్ జట్టులో లేకపోవటం మైనస్ పాయింటేనని చెప్పుకోవాలి. ఐతే...ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరిస్థుందనేది క్రీడాభిమానుల్లోఉత్కంఠను రేకెత్తిస్తోంది.  


ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో భారత్‌...బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ఇండోర్‌లో ప్రాక్టీస్‌ చేయాల్సి ఉన్నా స్టేడియంలోనే సాధన చేశారు. పొగమంచు అధికంగా ఉన్నా భారత ఆటగాళ్లు మాస్కులు లేకుండానే సాధన చేయడం విశేషం. ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ల ఆధ్వర్యంలో రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌తో పాటు మరికొందరు సాధన చేశారు. అయితే బంగ్లా ఆటగాళ్లు మాత్రం కాసేపు మాస్క్ లు  ధరించినా పరిస్థితులు మారాక వాటిని తీసిసాధన చేశారు. దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో శుక్రవారం అత్యవసరస్థితిని ప్రకటించారు. 


బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఈ విషయంపై తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌శర్మతో చర్చించారు. ఆటగాళ్లు ఎలాంటి ఇబ్బంది పడటం లేదని, గాలి నాణ్యత క్షీణించినా అదేమీ ప్రభావం చూపటంలేదని రోహిత్‌, దాదాకు వివరించాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగే తొలి టీ20కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు దెబ్బ తగలడం ఆందోళన కలిగించింది. అయితే అది తీవ్రమైనది కాదని మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని తేలడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం నెట్‌ ప్రాక్టీస్ లో త్రోడౌన్‌ సందర్భంగా రోహిత్‌ పొత్తికడుపులో బంతి బలంగా తాకింది. దాంతో విలవిల్లాడిన రోహిత్‌ నెట్‌ ప్రాక్టీస్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. 


భారత్ తో జరిగే సిరీస్ లో బంగ్లా ఆల్ రౌండర్ షకీబల్ లేకపోవటం ఆ జట్టుకు దెబ్బేనని  చెప్పాలి. అయితే పటిష్టమైన భారత్‌తో సిరీస్ ను సవాలుగా తీసుకొని తమ ఆటగాళ్లు  రాణిస్తారన్న ఆశాభావం ప్రకటించాడు డొమింగో. భారత బుకీ ఒకరు తనను  సంప్రదించిన విషయాన్ని వెల్లడించనందుకు షకీబల్‌ను ఐసీసీ రెండేళ్లపాటు సస్పెండ్‌ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: