క్రికెట్ లో మార్పులు కొత్తేమీ కాదు. కాలానికి తగ్గట్టు దానిలో మార్పులు వస్తూనే ఉన్నాయి. రోజు రోజుకీ క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రేక్షకులని బట్టి దాని ఆట పద్దతిని మార్చుకుంటోంది. వన్డే మ్యాచులు అలరిస్తున్న సమయంలో ట్వంటీ ట్వంటీలు వచ్చి ఆటలో జోష్ ని మరింత పెంచాయి. అయితే ప్రస్తుతం వన్డే మ్యాచుల్లో కూడా సరికొత్త విధానాలని తేవాలని ఎన్నో రోజులుగా అంటున్నారు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 


ప్రపంచ క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్ లో ఉన్న రికార్డులన్నీ తన పేర లిఖించుకున్న సచిన్ వన్డేలలో చేయాల్సిన మార్పులను సూచించాడు. యాభై ఓవర్ల మ్యాచులని ఇరవై ఐదు ఓవర్ల మ్యాచుగా విడదీసి నాలుగు ఇన్నింగ్స్ ల ఆటగా మార్చాలని అన్నాడు. ఇన్నింగ్స్ కి ఇన్నింగ్స్ కి మధ్యన పదిహేను నిమిషాల బ్రేక్ ఉండాలని సూచించాడు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. మొదట్ టీమ్ ఏ  ఇరవై ఐదు ఓవర్లు ఆడగానే తర్వాతి టీమ్ బి  ఇరవై ఐదు ఓవర్ల మ్యాచుని ఆడుతుంది. 


అప్పుడు టీమ్ ఏ తన ఇరవై ఆరవ ఓవరు నుండి యాభై ఓవర్లు కంప్లీట్ చేస్తుంది. తర్వాత ఆ టార్గెట్ ని టీమ్ బీ చేరుకోవాల్సి ఉంటుందట. ఒకవేళ మొదటి ఇరవై ఐదు ఓవర్లలో టీమ్ ఏ వికెట్స్ అన్నీ కోల్పోతే టీమ్ బీ యాభై ఓవర్లు ఆడాలట. అపుడు టీమ్ బీ క్రియేట్ చేసిన లక్ష్యాన్ని టీమ్ ఏ చేరుకోవాలట. ఇలా చేయడమ్ వల్ల ఆటలో కొత్తదనం పెరిగి వన్దేలకి కొత్త కళ వస్తుందని సచిన్ అభిప్రాయం. మరి సచిన్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వన్డేలకు కొత్త కళ తీసుకువస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: