బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీలో ఓటమి పాలైన టీం ఇండియా రెండవ మ్యాచ్ లో తన సత్తా చాటింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బంగ్లాదేశ్ ని బాగానే కట్టడి చేయగలిగింది. బ్యాటింగ్ కి అనుకూలమైన పిచ్ లో మన బౌలర్లు బాగా రాణించారు. దాంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ౧౫౩ పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలింగ్ లో చాహల్ రెండు వికెట్లు, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, సుందర్ లు తలో వికెట్ తీసుకున్నారు.


ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియాలో ఓపెనర్ గా వచ్చిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనదైన మెరుపులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా ఇండియాకి సునాయాసంగా విజయం లభించింది. తన కెరీర్లో వందో ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ గుర్తుందిపోయే ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు కలిసి పది ఓవర్లలో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ విజయాన్ని దాదాపు ఖాయం చేసేశారు.


రోహిత్ శర్మ తనదైన బ్యాటింగ్ తో మైదానంలో మెరుపులు మెరిపించాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ పది ఓవర్ల వద్దే మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంది. పది ఓవర్లలోనే వంద స్కోరు దాటించడంతో మిగతా స్కోరు నామమాత్రంగానే రాబట్టారు. మొత్తానికి పదిహేను ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన టీం ఇండియా రెండవ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సమం చేయగలిగింది.


ఆ తర్వాత జరిగే మూడో వన్డేలో కూడా భారత్ ఇలాంటి ప్రదర్శనే చేసి సిరీస్ గెలవాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: