న్యూజిలాండ్ గడ్డ పై టీ - 20 సిరీస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌ మెన్‌ వీరోచితంగా రెచ్చిపోయారు. న్యూజిలాండ్ లోని నేపియర్ వేదికగా కివీస్‌ తో జరిగిన నాలుగో టీ - 20 మ్యాచ్‌లో డేవిడ్ మలాన్ (103 నాటౌట్: 51 బంతుల్లో 9x4, 1x6), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (91: 41 బంతుల్లో 7x4, 7x6) విధ్వంసక ఇన్నింగ్స్‌ లు ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 241 పరుగులు చేసేసింది.


అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు దూకుడుగా ఆడే ప్రయత్నంలో 16.5 ఓవర్లలోనే 165 పరుగులకి ఆల్ అవుట్ అయ్యింది. ఆ జట్టులో కొలిన్ మున్రో (30: 21 బంతుల్లో 3x4), టిమ్ సౌథీ (39: 15 బంతుల్లో 2x4, 4x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరును చేశారు. దీనితో 76 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఐదు టీ - 20ల సిరీస్‌ని 2-2 తో సమం చేసింది. ఇక విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ - 20 మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఆదివారం జరగనుంది.


ఈ మ్యాచ్‌లో మూడో వికెట్‌ కి అభేద్యంగా 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డేవిడ్ మలాన్, ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ తరఫున టీ20ల్లో అరుదైన రికార్డ్‌ల్ని బద్దలుకొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 2018 లో జోస్ బట్లర్ 22 బంతులలో చేసిన అర్ధశతకం రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఇంగ్లాండ్ తరఫున వేగంగా వంద పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా కూడా డేవిడ్ మలాన్ నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్ టీమ్‌కి టీ20ల్లో (241/3) ఇదే అత్యధిక స్కోరు. 2016 సంవత్సరంలో దక్షిణాఫ్రికా పై చేసిన 230/8 రికార్డ్ కూడా చెరిపివేసారు. మోర్గాన్, మలాన్ జోడీ నెలకొల్పిన 182 పరుగుల భాగస్వామ్యం టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌ తరుపున ఇదే అత్యుత్తమం.


మరింత సమాచారం తెలుసుకోండి: