గత కొంతకాలంగా భారత మహిళా స్టార్‌ బాక్సర్లు మేరీకోమ్‌-నిఖత్‌ జరీన్‌ల మధ్య  నువ్వెంత అంటే నువ్వెంత అనేంతగా  మాటల యుద్ధం నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్నఒలింపిక్స్‌ కోసం చైనాలో జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ)  51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ను పంపడానికి  నిర్ణయించగా, దిన్నితీవ్రంగా  మరో స్టార్‌ బాక్సర్‌, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ వ్యతిరేకించింది.

తాను కూడా 51 కేజీల విభాగంలో ఉండటంతో తమ మధ్య ఒలింపిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్‌ నిర్వహించాలంటూ కోరుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జరీన్‌పై మేరీకోమ్‌ తీవ్రంగా ధ్వజమెత్తడం, దానికి నిఖత్‌ కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరుగుతూ వస్తున్నాయి.అయితే బీఎఫ్‌ఐ ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేనికారణంగా  .. వారి మధ్య సెలక్షన్‌ ట్రయల్‌ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. వరల్డ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌తో యువ స్టార్‌ బాక్సర్‌ జరీన్‌తో పోరు నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, డిసెంబర్‌ చివరి వారంలో విశ్వసనీయ సమాచారం ప్రకారం  వీరిద్దరికీ మధ్య ఫైట్‌  నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .  డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్‌ లీగ్‌(ఐబీఎల్‌) జరుగనున్న తరుణంలో ఆ తర్వాత మేరీకోమ్‌-జరీన్‌లకు మెగా ఫైట్  ట్రయల్స్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.


కొన్ని రోజులుగా తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌  మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌తో ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని  డిమాండ్‌ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా క్వాలిఫయింగ్‌ టోర్నీకి పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.నిఖత్‌ దీని కోసం క్రీడాశాఖా మంత్రి కిరణ్‌ రిజ్జుకు సైతం లేఖ  రాశారు. దీనిపై తానేమీ చేయలేనని, ఇది బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయం కావడంతో దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.  ఈ క‍్రమంలోనే వారి మధ్య వివాదం మరింత పెరిగింది . నిఖత్‌ జరీన్‌కు భారత విఖ్యత షూటర్‌ అభినవ్‌ బింద్రా మద్దతుగా నిలవడం కూడా మేరీకోమ్‌కు ఆగ్రహం తెప్పించింది.


‘నీకు మేరీకోమ్‌తో పోటీ ఏంటి. అభివన్‌ నువ్వు బాక్సింగ్‌ విషయంలో తలదూర్చుకు. ఇది షూటింగ్‌ కాదు. నీ షూటింగ్‌ పని నువ్వు చూసుకో’ అంటూ మేరీకోమ్‌ విరుచుకుపడింది. కాగా, దీనిపై బీఎఫ్‌ఐ కాస్త మెట్టుదిగినట్లే కనబడుతుండటంతో మేరీకోమ్‌-జరీన్‌ల మధ్య పోటీ దాదాపు ఖాయమేనని అనిపిస్తోంది. ఒకవేళ ఈ సెలక్షన్‌ ట్రయల్స్‌ జరిగితే  అందులో గెలిచిన బాక్సర్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: