ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్‌... తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్‌ల మధ్య ట్రయల్ ఫైట్ జరగనుందా? అంటే అవుననే వినిపిస్తోంది. ఒలింపిక్స్‌ క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లకు వీరిద్దరిలో ఒకరిని పంపడానికి బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రెడీ అయింది. దీంతో మేరీకోమ్‌-జరీన్‌లకు మెగా ఫైట్‌  ట్రయల్స్‌ ఏర్పాటు చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. 


గత కొంతకాలంగా నువ్వెంత అంటే నువ్వెంత అనేంతగా భారత మహిళా స్టార్‌ బాక్సర్లు మేరీకోమ్‌-నిఖత్‌ జరీన్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో భాగంగా చైనాలో జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు  51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ను పంపడానికి బి.ఎఫ్.ఐ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మరో స్టార్‌ బాక్సర్‌, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. తాను కూడా 51 కేజీల విభాగంలో ఉండటంతో తమ మధ్య ఒలింపిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్‌ నిర్వహించాలంటూ కోరుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జరీన్‌పై మేరీకోమ్‌ తీవ్రంగా ధ్వజమెత్తడం, దానికి నిఖత్‌ కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరిగాయి.


అయితే ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేని బి.ఎఫ్.ఐ.. వారి మధ్య సెలక్షన్‌ ట్రయల్‌ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆరుసార్లు వరల్డ్‌ ఛాంపియన్‌ మేరీకోమ్‌తో యువ స్టార్‌ బాక్సర్‌ జరీన్‌తో పోరు నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ ఏడాది డిసెంబర్‌ ఆఖరిలో వీరిద్దరి మధ్య ట్రయల్‌ ఫైట్‌ నిర్వహించడానికి రంగం సిద్దం చేసుకుంటోంది బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఒకవేళ ఈ సెలక్షన్‌ ట్రయల్స్‌ జరిగితే  అందులో గెలిచిన బాక్సర్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: