ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చ జరుగుతున్న ప్రధాన అంశం రిషబ్ పంత్‌ జట్టులో అవసరమా? బ్యాటింగ్‌లో తడబాటు.. వికెట్ల వెనుక తత్తర పాటుతో జట్టుకే దూరమయ్యేలా ఉన్నాడు పంత్‌. ధోనీలా కాకున్నా కనీసం తడబాటు లేకుండా తనపని తాను చేసుకుపోయినా.. రిషబ్ పంత్‌పై పెద్దగా విమర్శలు వచ్చి ఉండేవికావు. కానీ బ్యాటింగ్ వైఫల్యంతో పాటు వికెట్ల వెనుక ధోనీని అనుకరించాలనే అత్యుత్సాహం అతడి స్థానానికే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది.


రిషబ్ పంత్.. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ బ్యాట్స్‌మన్. పదో సీజన్‌లో చక్కటి ప్రదర్శన చేసిన పంత్‌కు జాతీయ జట్టు తరఫున తొందరగానే అవకాశం వచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు ఎంపికైన పంత్.. మహేంద్ర సింగ్ ధోనీ విరామం తీసుకోవడంతో టీ20లలో అరంగ్రేటం చేశాడు. అదే సమయంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటం కూడా పంత్‌కి కలిసొచ్చింది. కానీ వరుసగా ఛాన్స్‌లు ఇచ్చినా పంత్ తనను తాను ఫ్రూవ్‌ చేసుకోలేకపోతున్నాడు.


పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మిడిలార్డర్ సమస్యతో సతమతమవుతున్న టీమ్ ఇండియా నాలుగో స్థానంలో పంత్‌కు లెక్కకు మిక్కిలి అవకాశాలు ఇచ్చిందనే చెప్పాలి. అయినా వాటిని ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ పెద్దగా వినియోగించుకోలేకపోయాడు. కీలకమైన దశలో క్రీజులో అడుగుపెట్టినా.. ఆచితూచి ఆడటం మరిచి అడ్డదిడ్డమైన షాట్లతో వికెట్ సమర్పించుకోవడం అతడికి పరిపాటిగా మారిపోయింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాదిరిగా.. ఒంటిచేత్తో షాట్లు ఆడేందుకు యత్నించి పదే పదే విఫలమవుతున్నా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకోలేకపోతున్న పంత్.. ప్రపంచకప్ తర్వాత వికెట్ కీపర్‌గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు.


గాయం నుంచి కోలుకున్న వృద్ధిమాన్ సాహా తిరిగి జట్టులోకి రావడంతో టెస్టుల్లో పంత్ ప్లేస్ గల్లంతైంది. ఇప్పటికే బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోతున్న అతడు కీపింగ్‌లోనూ ఉసూరుమనిపిస్తుండటంతో పొట్టి ఫార్మాట్‌లోనూ ప్రత్యామ్నాయాల వైపు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం టీమిండియా తరఫున ఆడిన సంజూ శాంసన్‌కు తాజాగా మళ్లీ పిలుపొచ్చింది. 


ధోనీతో పోల్చడం కాదు కానీ, పంత్ కీపింగ్ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు లేవనేది ముమ్మాటికీ వాస్తవం. ధోని లాంటి ఓ దిగ్గజ ఆటగాడి స్థానంలో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ కుర్రాడిని ఊహించుకోవడం ఎవరికైనా కష్టమే. ధోనీలా కాకున్నా కనీసం తడబాటు లేకుండా తనపని తాను చేసుకుపోయినా.. రిషబ్ పంత్‌పై పెద్దగా విమర్శలు వచ్చి ఉండేవికావు. కానీ, దాదాతో పాటు టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ పంత్‌కు అండగా నిలిచాడు. ఒత్తిడిలో ఉన్న అతనికి మరిన్ని ఛాన్స్‌లివ్వాలని దాదా, రోహిత్‌ అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: