అనుకున్నదే జరిగింది. ఇండోర్‌లో బంగ్లాపై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. విక్టరీతో పాటు హోల్కర్‌ స్టేడియంలో కోహ్లీసేన రికార్డుల మోత మోగించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 3 వందల పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచి వారెవ్వా అన్పించింది కోహ్లీసేన.


బంగ్లాతో ఫస్ట్‌ టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఇండోర్‌లో భారత్‌ కొన్ని అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఈ విక్టరీతో విరాట్‌ కోహ్లీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరుపున అత్యధికంగా ఇన్నింగ్స్‌ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా నయా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 10 టెస్టుల్లో ఈ ఘనతను సాధించి అగ్రస్ధానంలో నిలవగా.. మిస్టర్‌ కూల్‌ 9 టెస్ట్‌లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక సారథిగా అత్యధిక విజయాలను సాధించడంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ అలెన్‌ బోర్డర్‌ సరసన కోహ్లి చేరాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 32 టెస్టు విజయాలను అందుకుంది. 


అదే విధంగా ఒకే సీజన్‌లో వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించడం టీమిండియాకు ఇది మూడో సారి. పుణె, రాంచీ టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై, ఇండోర్‌లో బంగ్లాపై కోహ్లీసేన వరుసగా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టీమ్‌ఇండియా 1992-93, 1993-94 సీజన్లలో కూడా ఈ తరహాలోనే విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి జట్టు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా ఆరో బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ రికార్డు సృష్టించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులు మాత్రమే చేసింది. ఏ ఇన్నింగ్స్‌లోనూ మయాంక్‌ 243 పరుగుల మార్క్‌ని బంగ్లా టీమ్‌ అందుకోలేకపోయింది.


ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ లో భారత జట్టు దూసుకుపోతోంది. పాయింట్ల విషయంలో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంది. అంతేకాదు, టెస్టు చాంపియన్‌షిప్‌లో 300 పాయింట్లు సాధించిన తొలి జట్టు కూడా భారతే. బంగ్లాపై విక్టరీతో ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 300 పాయింట్లు ఉన్నాయి. టెస్టుల్లో భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఆరు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక జట్లు చెరో 60 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. అంటే టీమిండియా కంటే 240 పాయింట్లు వెనకబడి ఉన్నాయి. ఇక ఇదే ఊపులో రెండో టెస్టులోనూ కోహ్లి సేన బంగ్లా పని పడితే మరెన్నో రికార్డులు టీమిండియా పేరిట లిఖించబడటం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: