పింక్‌  బాల్‌ టెస్ట్‌కి ఈడెన్‌ సిద్దమైంది. ఇప్పటికే పింక్‌ టెస్ట్‌కి ఫస్ట్‌ మూడు రోజుల టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయ్‌. మరి బంతి మారిస్తే టెస్ట్‌ క్రికెట్‌కు తిరిగి పూర్వవైభవం వస్తుందా..?  అసలు ఏంటీ పింక్‌ బాల్‌? 

 

గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాగానే.. తన ముద్ర ఎంటో చూపించాడు. భారత్‌లో పర్యటించనున్న బంగ్లా టీమ్‌తో పింక్‌ మ్యాచ్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ను ఒప్పించాడు. వారు ఒప్పుకోగానే ఈ చారిత్రాత్మక టెస్ట్‌కి చకాచకా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నాడు గంగూలీ. ఇప్పటికే న్యూజిలాండ్‌, ఆసీస్‌, పాక్‌, ఇంగ్లండ్‌ లాంటి టాప్‌ టీమ్స్‌ గులాబీ  మ్యాచ్‌లను ఆడేశాయి. క్రికెట్‌లో ఎంతో క్రేజ్‌ ఉన్న టీమిండియా మాత్రం ఇప్పటివరకూ పింక్‌ టెస్ట్‌ ఆడలేదు. 

 

భారత క్రికెట్‌ జట్టులో ప్లేయర్స్‌కి పింక్‌ బాల్‌ మీద అవగాహన లేదు. బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు.  తొలి టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యేందుకు ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ షూరు చేశారు. ఎలాగైనా తన హయాంలో ఈ పని పూర్తి చేయాలని భావించిన సౌరవ్‌ గంగూలీ తీసుకొన్న చొరవతో కోల్‌కతా టెస్టుకు గులాబీ హంగులు చేకూరబోతున్నాయి. అయితే రెగ్యులర్‌ డే టెస్టు మ్యాచ్‌కు భిన్నం కాబట్టి సహజంగానే నిర్వహణలో కొత్త సమస్యలు కూడా ఖాయం. బంతి మన్నిక మొదలు పిచ్, అవుట్‌ ఫీల్డ్, వాతావరణం, లైటింగ్‌... ఇలా అన్నీ మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తాయి. టీమిండియా ఆడబోతున్న ఈ తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌కి  ఎన్నో సవాళ్లు పరీక్షగా నిలవనున్నాయి.

 

నవంబర్‌లో భారత్‌లో మ్యాచ్‌లు అంటే రాత్రి పూట ఎప్పుడైనా మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కకపోవడం, బ్యాట్స్‌మెన్‌ పని సులువు కావడం వన్డేల్లోనే తరచుగా కనిపించే దృశ్యం. ఎక్కువ ఓవర్లు వేయాల్సి వచ్చే టెస్టులో బౌలర్లు ఏం చేయగలరనేది పెద్ద సమస్య. అయితే దీనికి తమ వద్ద పరిష్కారం ఉందని గంగూలీ చెబుతున్నాడు. పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చికను ఉంచితే బంతి ఎక్కువగా మన్నుతుందని గంగూలీ అభిప్రాయపడుతున్నాడు. మంచు ముప్పు తప్పించడానికి ఇప్పటికే మ్యాచ్‌ సమయాన్ని ముందుకు జరిపారు. మ్యాచ్‌ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 8 వరకు జరగనుంది. అయినా మంచు కొంత వరకైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు ఈ మ్యాచ్‌కు సంబంధించి తొలి మూడు రోజులకు టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో ఈ డే నైట్‌ టెస్ట్‌తో లాంగ్‌ ఫార్మెట్‌కు తిరిగి పునర్‌వైభవం వచ్చే అవకాశం ఉందంటున్నారు క్రికెట్‌ నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: