భారత యువ పేసర్ అభిమన్యు మిథున్ సంచలనం సృష్టించాడు. 6 బంతుల్లో 5 వికెట్లు తీసి టీ - 20ల్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం కర్ణాటక తరఫున ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్లో హరియాణాపై అభిమన్యు ఈ ఫీట్ నెలకొల్పాడు. హరియాణా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతులకు రాణా (61), తెవాటియా (32), సుమిత్ (0) లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించిన మిథున్, ఆ తర్వాత నాలుగో బంతికి అమిత్ మిశ్రా (0) ను పెవిలియన్ చేర్చాడు. 

 

టీ - 20 ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ (న్యూజిలాండ్ పై, 2019)లోని  రికార్డును సమం చేశాడు. అయితే ఆ తర్వాత ఐదో బంతిని వైడ్ గా వేసిన మిథున్, అదనపు బంతికి పరుగుని ఇచ్చాడు. అయితే ఆఖరి బంతికి జయంత్ యాదవ్ (0) ను ఔట్ చేసి ఐదో వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు మిథున్. దీనితో టీ - 20లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా మిథున్ ప్రపంచ రికార్డుని సృష్టించాడు. రంజీ, విజయ్ హజారె, ముస్తాక్ అలీ టోర్నీల్లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడు మిథున్.

 

విటితోపాటు కర్ణాటక ప్రిమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో అభిమన్యు మిధున్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు అతనికి సమన్లు జారీ చేశారు. లీగ్ లో మిథున్ శివమొగ్గ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.

 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న  ముస్తాక్ అలీ టీ - 20 టోర్నీలో కర్ణాటక, తమిళనాడు టైటిల్ కోసం తలపడనున్నాయి. తొలి సెమీలో మిథున్ బౌలింగ్ లో రాహుల్, దేవదూత్ బ్యాటింగ్ లో రాణించడంతో కర్ణాటక 8 వికెట్ల తేడాతో హరియాణాపై విజయం సాధించింది. మొదట హరియాణా 8 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యాన్ని కర్ణాటక 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పో యి ఛేదించింది. కర్ణాటకలో కేఎల్ రాహుల్ (66), దేవదూత్ (87) సత్తా చాటారు. 

 

మరో సెమీస్లో తమిళనాడు 5 వికెట్ల తేడాతో గుజరాత్ ను ఓడించింది. మొదట గుజరాత్ 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. షారుక్ ఖాన్ (56 నాటౌట్), దినేశ్ కార్తీక్ (47) రాణించడంతో లక్ష్యాన్ని తమిళనాడు 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆదివారం ఫైనల్లో తమిళనాడు, కర్ణాటక తలపడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: