క్రికెట్ లో ఆస్ట్రేలియా రూటే సెపరేటు. ఏ ఫార్మాట్ లోనైనా తమదైన ముద్ర వేయగలరు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు. ఇప్పటి వరకు క్రికెట్ లో ఎన్నో రికార్డులు వారి పేరు మీదే ఉన్నాయి. ఎక్కువ సార్లు ప్రపంచకప్ గెలవడం నుండి టెస్టుల్లో కూడా చాలా రికార్డులు ఆసీస్ పేరు మీదే ఉన్నాయి. ఆట మారినప్పుడల్లా తమని తాము మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

 

గత కొన్ని రోజులుగా ఆటలో తడబడుతున్న పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా చతికిల పడింది. ఆడిన రెండూ టెస్ట్ మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఆడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ ఓడిపోవడంతో టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా వశం అయింది. పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడంతో విమర్శలు ఎదురయ్యాయి. అయితే మరికొందరు ఆస్ట్రేలియాని ఓడించడం అంత ఈజీ కాదని చెప్తున్నారు. ఈ విషయమై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించాడు.

 

ప్రస్తుతం ఆసీస్‌ క్రికెట్‌ జట్టు ఉన్న పరిస్థితుల్లో వారిని ఏ జట్టుకైనా ఓడించడం అంత ఈజీ కాదన్నాడు. అందులోనూ ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించడమంటే అది మరింత కఠినతరమన్నాడు. కాకపోతే ప్రపంచ క్రికెట్‌లో ఉన్న ప్రస్తుత జట్లలో ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో ఓడించే సత్తా టీమిండియాకే ఉందన్నాడు. ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో టీమిండియా ప్రదర్శనను ప్రస్తావించాడు. ‘ కేవలం ఆసీస్‌ను వారి దేశంలో ఓడించాలంటే టీమిండియాకే సాధ్యమని, ఆసీస్ కి ధీటైన సవాల్ విసిరే జట్టు భారత్ మాత్రమేనని చెప్పాడు.

 

ఇంకా, ప్రస్తుతం టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. ఆసీస్‌కు గట్టిపోటీ ఇచ్చే జట్టు కచ్చితంగా టీమిండియా ఒక్కటే’ అని వాన్‌ పేర్కొన్నాడు. క్రికెట్ అభిమానులు ఆసీస్ భారత్ కి మధ్య మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య మ్యాచ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: