టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  అంతర్జాతీయ క్రికెట్‌లో గత మూడేళ్లుగా అన్ని ఫార్మాట్లను కలుపుకుని పరుగుల పరంగా టాప్‌లో కొనసాగుతూ వస్తున్నాడు . వరుసగా తన ఆధిపత్యాన్ని మూడేళ్లపాటు  సాగిస్తూ వస్తున్న కోహ్లికి ఇప్పుడు సహచర ఆటగాడు రోహిత్‌ శర్మ నుంచే తీవ్ర పోటీ ఎదురుకానుంది.  ఈ ఏడాది  2,183 పరుగులతో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు.

 

ఆ తర్వాత రెండో స్థానంలో  రోహిత్‌ శర్మ(2,090)  కొనసాగుతున్నాడు. ఇక పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ మూడో స్థానంలో (1820)  నిలిచాడు. అయితే ప్రస్తుతం కోహ్లి-రోహిత్‌ల మధ్య బ్యాటింగ్‌ పోటీ షురూ కావడం ఖాయంగానే కనబడుతోంది. పెద్దగా వీరి మధ్య పరుగుల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో పరుగుల మెషీన్‌ కోహ్లికి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ చెక్‌ పెట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

 

ఇంకా ఈ ఏడాది భారత్‌  ఆరు మ్యాచ్‌లు ఆడనుంది . అందులో ఆరు కూడా విండీస్‌పైనే. ఒకటి  మూడు వన్డేల సిరీస్‌ అయితే, ఇంకొటి మూడు టీ20 సిరీస్‌ . ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఎవరైతే రాణిస్తారో వారే టాప్‌లో నిలిచే అవకాశం ఉంది.  టీ20ల్లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ సక్సెస్‌ అయితే పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశం కోహ్లికి  ఉండదు. అదే సమయంలో రోహిత్‌ విఫలమై,  ఫస్ట్‌ డౌన్‌లో వచ్చి బ్యాట్‌ ఝుళిపిస్తే తన రికార్డును కాపాడుకోనే అవకాశం కోహ్లికి  ఉంటుంది. ఇక విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కూడా వీరి ప్రదర్శనపైనే టాప్‌ ఆధారపడి వుంటుంది.  

 

రెండు సిరీస్‌ల్లో కోహ్లి సక్సెస్‌ అయితే అతని రికార్డుకు ఎటువంటి ఢోకా ఉండదు. కోహ్లి విఫలమైన పక్షంలో రోహిత్‌ విశేషంగా రాణిస్తే 2019 పరుగుల వీరుడిగా నిలుస్తాడు. ఇద్దరూ ఫామ్‌లోనే ఉండటంతో టాప్‌పై ఆసక్తి నెలకొంది.  2016 నుంచి  ప్రతీ ఏడాది అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లినే టాప్‌లో నిలుస్తున్నాడు.  2016లో 2,595 పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన కోహ్లి.. 2017లో 2,818 పరుగులతో, 2018లో 2,735 పరుగులతో టాప్‌ను నిలబెట్టుకున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: