ఛేంజింగ్ లో మరో సారి అదిరిపోయే బ్యాటింగ్  తో  టీమిండియా ను  విజయతీరాలకు  చేర్చి   ఛేజింగ్ కింగ్  అనిపించుకున్నాడు  కెప్టెన్  విరాట్ కోహ్లి. ఉప్పల్ వేదికగా  వెస్టిండీస్ తో జరిగిన  మొదటి టీ 20లో  6వికెట్ల తేడాతో భారత్   ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్న  విండీస్  నిర్ణీత  20 ఓవర్ల లో 5వికెట్ల నష్టానికి 207 పరుగులు భారీ స్కోరు  చేసింది. 17బంతుల్లో 40పరుగులతో ఓపెనర్ ఎవిన్  లేవీస్ మెరుపులు మెరిపించగా  అతనికి తోడు హేట్మెయర్(56), పోలార్డ్ (37),బ్రెండన్ కింగ్ (31)హోల్డర్ (24*)  రాణించడంతో  విండీస్ పరుగుల వరద పారించింది. 
 
 
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భరిలోకి దిగిన  భారత్ కు  ఆదిలోనే  ఎదురుదెబ్బ తగలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(8) రెండెంకల స్కోర్ కూడా చేయకుండానే  పెవిలియన్ చేరగా  ఈ దశలో  రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు కోహ్లి. స్వేచ్చగా ఆడుతూ రాహుల్ బ్యాట్ ఝుళిపించగా ఆరంభంలో  నిధానంగా ఆడిన కోహ్లి ఆ తరువాత  విశ్వరూపం చూపించాడు.  తనకు మాత్రమే  సాధ్యమయ్యే క్లాసిస్ షాట్ లతో  స్టేడియం  నలుమూలల బౌండరీలు బాదుతూ జట్టును లక్ష్యం  వైపు నడిపించాడు. ఈక్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ (62) అవుట్ కాగా   కోహ్లీ మాత్రం  జోరు తగ్గించలేదు.  మరో వైపు వచ్చి రాగానే సిక్స్ తో ఖాతా తెరిచిన పంత్(18)  ఎక్కువ సేపు క్రీజ్ లో లేకపోయినా కీలక సమయంలో దూకుడుగా ఆడి  జట్టును లక్ష్యానికి మరింతగా దగ్గర  చేసి వెనుదిరిగాడు.  శ్రేయాస్ అయ్యర్ కూడా తొందరగానే వెనుదిరిగినా అప్పటికే భారత్ విజయం   ఖరారైయింది.  19ఓవర్  నాల్గో బంతిని  సిక్స్ గా మలిచి  గెలుపును  ఖాయం చేశాడు  కోహ్లీ.   94పరుగులతో  అజేయంగా నిలిచిన కోహ్లీ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా  రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: