వాంఖండే స్టేడియం వేదికగా టీం ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్లు రెచ్చిపోయారు. విండీస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. వాళ్లు బంతులు వేయ‌డ‌మే ఆల‌స్యం బౌండ‌రీల‌కో లేదా సిక్స‌ర్ల‌కు తర‌లించేశారు. ముందుగా టాస్ గెలిచిన విండీస్ భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పది ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా స్కోర్ 116. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 

 

10 ఓవ‌ర్ల‌కు రోహిత్ శర్మ 29 బంతుల్లో 63 పరుగులు చేయగా.. రాహుల్ 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత వారి దూకుడు కొన‌సాగింది. రోహిత్ శ‌ర్మ 71 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్ప‌టికే భార‌త్ స్కోర్ 135. వ‌న్ డౌన్‌లో హిట్ట‌ర్‌గా వ‌చ్చిన రిషిబ్ పంత్ కేవ‌లం రెండు బంతులే ఎదుర్కొని పోలార్డ్ బౌలింగ్‌లో షార్ట్‌కు ప్ర‌య‌త్నించి డ‌క్ అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశ ప‌రిచాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన విరాట్ కోహ్లీ సైతం కేఎల్‌.రాహుల్‌కు అండ‌గా నిలిచి విరుచుకు ప‌డ్డాడు. కోహ్లీ 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 50 ప‌రుగులు చేశాడు.

 

ఇక 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త జ‌ట్టు మొత్తం 3 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగులు చేసి విండీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. కోహ్లీ - రాహుల్ జంట కూడా ఆకాశ‌మే హ‌ద్దుగా రెచ్చిపోవ‌డంతో విండీస్ బౌల‌ర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇక కేఎల్. రాహుల్ 91 ప‌రుగులు చేసి చివ‌రి ఓవ‌ర్లో మ‌రో రెండు బంతులు మిగిలి ఉండ‌గా అవుట్ అయ్యాడు. కార్టెల్ బౌలింగ్‌లో కీప‌ర నికోల‌స్ పూరాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కోహ్లీ 70 ప‌రుగులు చేసి, శ్రేయాస్ అయ్య‌ర్ 0 ప‌రుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. మ‌రి విండీస్ ఈ భారీ ల‌క్ష్యాన్ని చేధిస్తే అది రికార్డే అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: