ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మూడు టీ20 ల్లో భారత్ రెండు గెలవగా, మిగిలిన ఒక మ్యాచ్ వెస్టిండీస్ గెలిచింది. వాటి అనంతరం నేడు వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ముందుగా టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ని ఎంచుకుంది. కాగా బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా, కోహ్లీ మరియు రాహుల్ కేవలం సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేసి వెనుదిరిగారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన శ్రేయాస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్

 

తమ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టు స్కోర్ ని పెంచడంతో పాటు ఇన్నింగ్స్ మొత్తంలో అత్యధిక పరుగులు సాధించిన వారిగా నిలిచారు. శ్రేయాస్ అయ్యర్ 88 బంతుల్లో 70 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్సర్ ), రిషబ్ పంత్ 69 బంతుల్లో 71 పరుగులు (7 ఫోర్లు, 1 సిక్సర్) చేసారు. వారి తరువాత బ్యాటింగ్ కి దిగిన కేదార్ జాదవ్ 35 బంతుల్లో 40 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్సర్) చేసాడు. కాగా మ్యాచ్ ముగిసే సమయానికి భారత జట్టు 50 ఓవర్లకు గాను 287 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. వెస్టిండీన్ బౌలర్లలో కొట్రెల్, పాల్, జోసెఫ్ ముగ్గురూ కూడా 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన వెస్టిండీస్ జట్టు ఓపెనర్లలో అంబ్రీస్ 9 పరుగులకే అవుట్ అవ్వగా, 

 

మరొక ఓపెనర్ హోప్ 102 (7 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు సాధించాడు. అనంతరం వన్ డౌన్ బ్యాట్స్ మ్యాన్ గా బరిలోకి దిగిన హేట్మేయర్ 106 బంతుల్లో 139 (11 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. కాగా మన బౌలర్లలో చాహర్, షమీ లకు చెరొక వికెట్ లభించింది. నిజానికి వెస్టిండీస్ బ్యాటింగ్ ధాటికి మన బౌలర్లు అడ్డుకట్ట వేయడనికి ఎంతో సతమతం అయ్యారు అనే చెప్పాలి. ఇక చివరకు భారత స్కోర్ ని ఛేదించిన వెస్టిండీస్ జట్టు 47.5 ఓవర్లలో 291 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని దక్కించుకుంది......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: