క్రికెట్ పుట్టినిల్లు  ఇంగ్లాండ్ కు ఈఏడాది  మరుపురాని  సంవత్సరమని చెప్పొచ్చు.  ఈ ఏడాది  సొంత  గడ్డపై జరిగిన మెగా టోర్నీ..   వన్డే  ప్రపంచ కప్ ను మొదటి సారి గెలుచుకొని  చరిత్ర సృష్టించింది  ఇంగ్లాండ్.  ఈ టోర్నీ లో  ఫైనల్ లో  ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ లు తలపడగా  సూపర్ ఓవర్ వరకు దారితీసిన ఈ  మ్యాచ్ ను గెలుచుకొని  కప్ ను ముద్దాడింది ఇంగ్లాండ్.  ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికి  గుర్తుండిపోతుంది. 
 
ఇక   టోర్నీ  హాట్ ఫేవరేట్  గా బరిలోకి  దిగిన  టీమిండియా  సెమిస్ లో బోల్తా పడింది. మొదటి సెమిస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన పోరులో  ఓటమిని చవిచూసి  భారత జట్టు ఇంటిముఖం పట్టింది.  దాంతో  భారత క్రికెట్ అభిమానుల హృదయాలు ముక్కలైయ్యాయి.   ముఖ్యంగా ఈమ్యాచ్ లో ధోని అవుట్ అయ్యి పెవిలియన్  చేరుతున్న దృశ్యం  ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమానిని  కంట తడి పెట్టించింది.  అయితే  కప్  ను గెలువకపోవచ్చు కానీ  టీమిండియా ఓపెనర్  హిట్ మ్యాన్  రోహిత్ శర్మ  కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ప్రపంచ కప్ లో 5సెంచరీలు చేసి  రోహిత్ టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు.  ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ఎక్కువగా రోహిత్ రికార్డుల గురించే చర్చ నడిచింది. 
 
ఇక ప్రపంచ కప్ తరువాత  అన్నిటికంటే  ఎక్కువ చర్చకు  వచ్చింది  ధోని  రిటైర్మెంట్.  ప్రపంచ కప్ సమయంలోనే  ధోని  రిటైర్మెంట్ ప్రకటిస్తాడని  అందరు భావించారు కానీ  నేను  ఎప్పుడు రిటైర్ అవుతానో  నాకే తెలియదు అని స్టేట్మెంట్ ఇచ్చి  అయోమయం లో పడేశాడు ధోని.   అయినా కూడా  ధోని రిటైర్మెంట్ పై రోజుకో వార్త హల్ చల్  చేసింది. ధోని మాత్రం   తాత్కాలికంగా ఆటకు విరామం ప్రకటించి  సైన్యం లో చేరాడు. ఇటీవలే  సైన్యం లో విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ధోని  తన  కుటుంభం తో సమయాన్ని గడుపుతున్నాడు.   దాంతో సౌతాఫ్రికా , బంగ్లాదేశ్ అలాగే   తాజాగా జరుగుతున్నవెస్టిండీస్  సిరీస్ లకు దూరంగా వున్నాడు. కాగా  రిటైర్మెంట్ విషయం లో ధోని పై  బీసీసీఐ  కూడా ఎలాంటి ఒత్తిడి తీసుకరావడం లేదు దాంతో వచ్చే ఏడాది  20 -20 ప్రపంచ కప్ తరువాతే  ధోని  రిటైర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే  అభిమానులు మాత్రం ధోని మరోరెండేళ్లు క్రికెట్ లో కొనసాగాలని  ఆకాంక్షిస్తున్నారు. 
 
ఇక  ఈఏడాది  టీమిండియా ప్రదర్శన విషయానికి వస్తే  అన్ని విభాగాల్లో మెరుగై ప్రస్తుతం టెస్టు , వన్డే ల్లో   నెంబర్ వన్  టీం గా  కొనసాగుతుంది.  ఈఏడాది టెస్టుల్లో  ఒక్క ఓటమి లేకుండా  వున్న  జట్టు కూడా ఇండియానే కావడం విశేషం. అంతేకాదు  ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్  జరుగుతున్న నేపథ్యంలో  ఈ టోర్నీ   పాయింట్ల పట్టికలో ఒక్క ఓటమి కూడా లేకుండా 360 పాయింట్ల తో భారత్   అగ్ర స్థానం లో కొనసాగుతుంది.  అయితే  టీ 20ల్లో మాత్రం ఇంకా మెరుగవ్వాల్సి వుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: