విరాట్ కోహ్లీ...అంతర్జాతీయ క్రికెట్ లో అటు బ్యాటింగ్ లోనూ, కెప్టెన్ గానూ తనదైన పర్ ఫార్మెన్స్ తో దూసుకు పోతున్నాడు. ఏ ఫార్మాట్లో అయినా తనదైన మార్కు ప్రదర్శనతో టీమిండియాని గెలిపిస్తూ వస్తున్నాడు. ధోనీ లాంటి అత్యంత ఉత్తమమైన కెప్టెన్సీ తర్వాత భారత టీంకి మరో అద్భుతమైన కెప్టెన్ విరాటేనని అంటుంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో మెరుపులు మెరిపించే విరాట్ ఐపీఎల్ లో మాత్రం చతికిల పడుతున్నాడు.

 

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి సారథ్యం వహించే విరాట్ కి ఏదీ కలిసి రావట్లేదు. గత కొన్నేళ్ళుగా ఐపీఎల్ లో బెంగళూరు ప్రదర్శన ఎలా ఉందో ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఇంతవరకు ఈ జట్టు కప్ గెలుచుకోలేదు. కప్ సంగతి పక్కన పెడితే కనీసమ్ ప్లే అఫ్ కి కూడా చేరుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాయింట్ల పట్టికలో కింది వరుసకే పరిమితం అవుతోంది. 

 

ప్రతిసారీ బెంగళూరు అభిమానులు ‘ఈ సాలా కప్ నమదే’ అనుకోవడం.. కోహ్లీ జట్టేమో తుస్సుమనిపించడం మామూలైపోయింది. వేలంలో సరైన ఆటగాళ్ళను ఎంచుకోకపోవడం, ఎంచుకున్న వారికి ఎక్కువ డబ్బులు పెట్టడం, వారేమో సరిగ్గా ఆడకపోవడం వంటివన్ని బెంగళూరు పాలిట శాపంగా మారాయి. అయితే బెంగళూరు ఈ సారి కూడా అలాంటి తప్పిదమే చేసింది.
 

 

గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ ‌రౌండర్ క్రిస్ మోరిస్ మీద బెంగళూరు ఏకంగా రూ.10 కోట్లు పెట్టేసింది. మోరిస్‌ అంత గొప్ప ఆటగాడేమీ కాదు. అంతర్జాతీయ క్రికెట్లో కానీ.. ఐపీఎల్‌లో కానీ ఎప్పుడూ అంతగా రాణించలేదు. అలాంటీ ఆటగాడికి పది కోట్లు పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ఆటగాళ్లతో ఈ సంవత్సరం ఎంతవరకు పోరాడతారో చూడాలి. కోహ్లీ సారథ్యం ఈ సారైనా పని చేస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: