తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో సంపాదించుకున్న క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని. క్రికెట్‌కు  గత కొంతకాలంగా దూరంగా ఉంటూ కుటుంబంతో గడుపుతున్న ధోని.. నేటికి సరిగ్గా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి  పదిహేనేళ్లు. బంగ్లాదేశ్‌తో 2004, డిసెంబర్‌ 23వ తేదీన  చిట్టగాంగ్‌లో జరిగిన మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశాడు. ధోనికి తొలి మ్యాచ్‌  ఒక చేదు జ్ఞాపకాల్ని మిగల్చగా ఆ తర్వాత కాలంలో అతని కెరీర్‌ ఒక గొప్ప దశను చూసింది.   అత్యంత సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా భారత క్రికెట్‌లో ధోని ఘనత సాధించాడు. అతని సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. చాంపియన్స్‌ ట్రోఫీని సాధించిన పెట్టిన ఘనత కూడా ధోనిదే. దాంతో ధోని ఐసీసీ నిర్వహించే అన్ని మేజర్‌ టోర్నీలను సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా  ఖ్యాతి గడించాడు. ఇక భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌ మార్క్‌ ధోని సొంతం. ఈరోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తి చేసుకుంటున్న ధోని గురించి కొన్ని విశేషాలను నెమరువేసుకుందాం.

 

 సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో  2004లో బంగ్లాదేశ్‌తో ధోని అరంగేట్రం చేసిన వన్డే మ్యాచ్‌ ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ధోని ఆ మ్యాచ్‌లో  గోల్డెన్‌ డక్‌గా పెవిలిన్‌ చేరాడు. ధోని 19 పరుగులే ఆ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో  చేసి నిరాశపరచడంతో తన కెరీర్‌పై డైలామాలో పడ్డాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలనా.. అనే ప్రశ్న తలెత్తిన సిరీస్‌ అది. కాగా,  ఒక్కసారిగా 2005లో ధోని కెరీర్‌ మలుపు తిరిగింది. ధోని  విశాఖపట్టణంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తనలోని సత్తాను ప్రపంచానికి చూపెట్టిన క్షణమది.  

 

ధోని పాకిస్తాన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను చీల్చిచెండాడుతూ 123 బంతుల్లో 148 పరుగులు సాధించాడు. అప్పట్నుంచి ఇప్పటివరకూ ధోని వెనుదిరిగి చూసింది లేదు. ఇప్పటికే తన 15 ఏళ్ల కెరీర్‌లో  ధోని జపం వినిపిస్తుందంటే అతను భారత్‌ క్రికెట్‌ను ఎంతటి ఉన్నతి శిఖరాలకు తీసుకెళ్లాడు అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో భారత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ధోని.. 2007లో టీ20  వరల్డ్‌కప్‌ను, 2011 వన్డే వరల్డ్‌కప్‌ను సాధించిపెట్టాడు.

 

2013లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను విజేతగా ధోని  నిలిపాడు. ఫలితంగా ఐసీసీ నిర్వహించే అన్ని మేజర్‌ ట్రోఫీలను సాధించిన ఒకే ఒక భారత కెప్టెన్‌గా ధోని రికార్డు పుటల్లోకెక్కాడు. తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని సాధించిన ఘనతల్ని అభిమానులు స్మరించుకుంటూ అతన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.ఒక అభిమాని  ‘ నిన్ను మిస్‌ అవుతున్నాము ధోని’ అని  ట్వీట్‌  చేయగా, ‘ ఇంకా ధోనికి రిప్లేస్‌మెంట్‌ దొరకలేదు’ అని మరొకరు  ట్వీట్‌ చేశారు.మరొక అభిమాని  ‘ నువ్వు జట్టులో లేని భారత జట్టును ఊహించుకోవడమే కష్టంగా ఉంది’ అని  పోస్ట్‌ చేయగా, ‘ ఒక టీమ్‌ ప్లేయర్‌ను గుర్తు చేసుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది నువ్వే ధోని’ అని మరొకరు పేర్కొన్నారు.

 

 

‘ ఎలా స్టార్ట్‌ చేసామన్నది ముఖ్యం కాదు.. ఎలా ఫినిష్‌ చేశామన్నది ముఖ్యం’ అని మరొకరు తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘ సిక్స్‌ కొట్టాలంటే ఎవరైనా నీ తర్వాతే’ అని ఒకరు పేర్కొనగా, ‘  సుదీర్ఘ విరామం తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ సాధించి పెట్టిన ధోనికి హ్యాట్సాఫ్‌’ అని మరొకరు ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: