ఇంతకీ నిఖత్‌ చేసింది తప్పా? నిబంధనలు గుర్తు చేయడం నేరమా? 48 కేజీల విభాగం నుంచి 51 కేజీల విభాగంలోకి మారిన మేరీ మరొకరి ఒలింపిక్స్‌ ఆశలకు గండి కొట్టడం సరైందేనా?

 

మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయినా.. ఈ ఏడాది కాంస్యంతో సరిపెట్టుకుంది. ఒకవేళ స్వర్ణం గెలిచి ఉంటే... ట్రయల్స్‌లో పాల్గొనే అవసరం ఉండేది కాదు. కానీ.. నేరుగా  క్వాలిఫయింగ్‌ టోర్నీకి పంపుతామని బి.ఎఫ్.ఐ అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ చేసిన ప్రకటనతో వివాదం మొదలైంది. దీనికితోడు ఇన్నాళ్లూ 48 కేజీల విభాగంలో ఆడిన మేరీకోమ్‌.. ఒక్కసారిగా 51 కేజీల విభాగంలోకి మారింది. దీంతో 51 కేజీల కేటగిరిలో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఆశిస్తున్న నిఖత్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. జూనియర్‌ విభాగంలో  ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్‌...  సీనియర్‌ స్థాయిలోనూ ఎంతో సత్తా చాటుతోంది. ఇలాంటి సమయంలో ట్రయల్స్‌ కాకుండా.. నేరుగా క్వాలిఫైయింగ్‌కు మేరీని పంపుతామన్న ప్రకటనతో విభేదించింది నిఖత్‌. దీనిపై క్రీడా శాఖకు లేఖ రాసింది. మేరీని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీడియాలో పెద్ద చర్చ జరగడంతో మేరీని కూడా ట్రయల్స్‌లో పాల్గొనాలని బి.ఎఫ్.ఐ తేల్చింది. వాస్తవానికి ఈ వివాదంలోకి మేరీ పేరును లాగలేదు. నిబంధనల ప్రకారం తనకూ న్యాయం చేయాలని మాత్రమే నిఖత్‌ కోరింది.

 

అది మనసులో పెట్టుకున్న మేరీకోమ్‌.. శనివారం జరిగిన బౌట్‌లో తన వైఖరిని బయటపెట్టింది. ఒక సీనియర్‌ బాక్సర్‌గా క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి ప్రవర్తించింది. తీవ్ర పదజాలంతో నిఖత్‌ను దూషించింది. గెలిచేందుకు తెలుగమ్మాయి హోరాహోరీగా పోరాడినా ఫలితం దక్కలేదు. దీనికితోడు బౌట్‌లో పక్షపాతం చూపించారనే ప్రచారం కూడా తోడైంది. BFI మేరీకి ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో తన బౌట్‌కు లైవ్‌ ఉండాలని కోరింది నిఖత్‌. బౌట్‌ సాగిన తీరు.. ఫలితం చూశాక ఆమె అనుమానం  నిజమేనని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇద్దరు బాక్సర్లలో ఎవ్వరూ స్పష్టమైన పంచ్‌లు విసరలేదు. ఫలితాలు వెల్లడయ్యాక తెలంగాణ బాక్సింగ్‌ సంఘం ప్రతినిధి ఏపీ రెడ్డి నిఖత్‌కు అన్యాయం జరిగిందని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన్ని బయటకు పంపించేశాడు బి.ఎఫ్.ఐ చీఫ్‌ అజయ్‌ సింగ్‌. దీనిపైనా నిఖత్‌ ఏ వ్యాఖ్యా చేయలేదు. 

 

ఇంత జరిగినా.. మేరీకోమ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. నిఖత్‌ను కౌగిలించుకోవడానికి ఇష్టపడలేదు. చేతులు కలపలేదు.. అయితే ఏమిటి?  అంటూ మీడియా సమావేశంలో రుసరుసలాడింది మేరీకోమ్‌. భారత బాక్సర్‌ ఎవ్వరూ అందుకోని ఘనత సాధించిన తననే ప్రశ్నిస్తారా అంటూ అహం ప్రదర్శించింది మేరీ.

 

ఇంత వివాదం నడిచినా... నిఖత్‌కు ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో చైనాలో జరిగే ఆసియా క్వాలిఫైయింగ్‌ టోర్నీలో 51 కేజీల విభాగంలో మేరీ బెర్త్‌ సాధించకపోతే.. నిఖత్‌కు అవకాశం ఉంటుంది.  మేలో జరిగే ప్రపంచ క్వాలిఫైయింగ్‌ పోటీల్లో పాల్గొనే వీలు కలుగుతుంది. కాకపోతే... అప్పుడు కూడా ట్రయల్స్‌ ద్వారానే టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: