ఐపీల్ క్రికెట్ లో రాణించగలిగితేనే మహేంద్ర సింగ్  ధోని కి భారత్ టి -20  జట్టు లో స్థానం లభిస్తుందా ? అంటే అవుననే భారత్ జట్టు మాజీ కెప్టెన్ , దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అంటున్నారు . వన్డే ప్రపంచ  కప్ క్రికెట్ టోర్నీ తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న ధోని , ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే ప్రపంచ కప్ టి -20 టోర్నీ లో పాల్గొనే భారత్ జట్టు లో చోటు దక్కించుకోగలడా?, లేదా ?? అన్నదానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది .

 

 అయితే ధోని తిరిగి జట్టు లో చోటు దక్కించుకోవడం అంత ఆషామాషీ వ్యవహారమేమి కాదని మాజీలు అంటున్నారు .  వన్డే  ప్రపంచ కప్ టోర్నీ లో ధోని బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి . ఇక టి -20 వంటి ధనా,  ధన్ క్రికెట్ కు రిషబ్ పంత్ లాంటి యువ క్రికెటర్ ఉండనే ఉన్నాడు  . ఈ తరుణం లో వయస్సుపై బడుతున్న ధోని కి సెలెక్టర్లు అవకాశం ఇస్తారా ? లేదా ?? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది . ఐపీల్ 2020 సీజన్ లో ధోని అద్భుత ప్రదర్శన చేస్తే తప్ప , అతనికి జట్టు లో చోటు లభించే అవకాశాలేంత మాత్రం లేవన్న వాదనలు విన్పిస్తున్నాయి .

 

రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యం లో ధోని మెరుగైన ప్రదర్శన ద్వారా ఆకట్టుకుంటే జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయని క్రీడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు . ఒకవేళ ఐపీల్ లో ధోని ఆశించిన స్థాయి లో రాణించలేకపోతే మాత్రం , ఇక అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడమే బెటరని సూచిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: