క్రికెట్ లో ప్రతిభ చూపించే ఆటగాళ్లకు ఐసీసీ ప్రతి ఏటా వివిధ విభాగాల్లో అవార్డులిచ్చే విషయం తెలిసిందే. అందులో భాగంగానే భారత ఓపెనర్ రోహిత్ శర్మకు ఐసీసీ నుంచి అరుదైన ఘనత దక్కింది. 2019 మొత్తం వన్డే ఫార్మాట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మని ఐసీసీ ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌’ అవార్డు ప్రకటించింది. 2019లో 28 వన్డేలాడిన రోహిత్ 57.30 సగటుతో 1,490 పరుగులు చేశాడు. వీటిలో ఏడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా.. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఏకంగా ఐదు శతకాలు చేశాడు.

 

 

వరల్డ్‌కప్ చరిత్రలో ఇలా ఏ బ్యాట్స్‌మెన్ కూడా 5 సెంచరీలు నమోదు చేయలేదు. గత ఏడాది రోహిత్ శర్మ తర్వాత వన్డేల్లో టాప్ స్కోరర్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లీ 1,377 పరుగులతో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్పెషల్ అవార్డు దక్కింది. గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానులు అతడ్ని గేలి చేసారు. ఆ సమయంలో అభిమానుల్ని వారించి చప్పట్లు కొట్టాల్సిందిగా కోహ్లీ సైగలు చేసాడు. ఇందుకు అతడికి ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు’ దక్కింది. టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ దక్కించుకున్నాడు. 

 

 

టెస్టుల్లో పాట్ కమిన్స్ గతేడాది 23 ఇన్నింగ్స్‌ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత ఆస్ట్రేలియాకే చెందిన మరో స్పిన్నర్ నాథన్ లయన్ 45 వికెట్లతో ఉన్నాడు. అతను కూడా 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. మొదటి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: