భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ఇక ముగిసినట్టేనా ? అంటే అవుననే  బీసీసీఐ పరోక్షంగా  చెప్పేసింది .  భారత్ జట్టు  సీనియర్ ఆటగాళ్ల వార్షిక  ఒప్పందాలను బీసీసీఐ  ప్రకటించింది . ఈ జాబితా ను నాలుగు విభాగాలుగా విభజించింది . ఏ విభాగం లోను బీసీసీఐ ,  ధోని కి స్థానం కల్పించలేదు . నిన్న మొన్నటి వరకు భారత్ జట్టు కీలక ఆటగాడిగా కొనసాగిన ధోని , గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ టోర్నీ లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెల్సిందే .

 

అయితే టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు అనూహ్యంగా సెమీస్ లోనే నిష్క్రమించి ఇంటి దారిపట్టింది . సెమీస్ లో రాణించి అర్ధ సెంచరీ సాధించిన ధోని , ఆ తరువాత విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగా ఉంటూ వచ్చారు . ధోని వయస్సు పైబడుతుండడం, యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న నేపధ్యం లో మాజీ కెప్టెన్ కెరీర్ ప్రశ్నార్ధకం లో పడింది . ధోని కెరీర్ పై మరో మాజీ కెప్టెన్ , ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు . దాంతో ధోని కెరీర్ ముగిసినట్టేనన్న వ్యాఖ్యలు విన్పించాయి .

 

గంగూలీ వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చే విధంగా ఇటీవల రవిశాస్త్రి కామెంట్స్ చేయడంతో , ఇక ధోని పని అయిపోయినట్టేనన్న వాదనలు విన్పించాయి . ఇప్పటికే టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని , వన్డే , టి -20 లలో మాత్రం కొనసాగుతున్నారు . వన్డే , టి 20 జట్టు లో స్థానం కోసం యువ ఆటగాళ్లు పోటీ పడుతుండడం, ధోని కాంట్రాక్ట్ పొడిగించే సాహసాన్ని బీసీసీఐ చేయలేకపోయినట్లు స్పష్టం అవుతోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: