ఆడుతున్నప్పుడు రికార్డులు కొల్లగొట్టిన క్రికెట్ రారాజు.. ఇప్పుడు ఓ దేశం భవిష్యత్తు కోసం కోచ్‌ అవతారమెత్తాడు. ఆస్ట్రేలియా కార్చిచ్చుతో అడవిలో ఆర్తనాదాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. గుండె చెరువై ఘోషిస్తున్న నిరాశ్రయుల, ముగ జీవుల ఆకలికేకలు చూసి చలించలేక ఉండలేకపోతున్నారు. ఆ బాటలోనే నడుస్తున్నారు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, కోట్నీ వాల్ష్‌.

 

కార్చిచ్చు బాధితుల సహాయార్థం భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌, వెస్టిండీస్‌ ఆల్‌టైమ్ ఫేమ్ బౌలర్ కోట్నీ వాల్ష్‌ కోచ్‌లుగా అవతారమెత్తనున్నారు. ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో ధన, ప్రాణ నష్టపడకడ్డ.. వారికి సహాయం అందించడం కోసం పాంటింగ్ XI, వార్న్‌ XI జట్లతో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు బుష్‌ఫైర్‌ క్రికెట్‌ బాష్‌ మ్యాచ్‌ను నిర్వహించనుంది. రికీ పాంటింగ్‌ జట్టుకు సచిన్‌, షేన్‌ వార్న్‌ జట్టుకు వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్ వాల్ష్‌ కోచ్‌లుగా వ్యవహరించనున్నట్లు తెలిపింది ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు. 

 

సచిన్, వాల్ష్‌ను ఆస్ట్రేలియాకు స్వాగతిస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉందని, వారిద్దరు ఆసీస్‌లో ఆటగాళ్లుగా ఎన్నో విజయాలు సాధించారని.. ప్రకటించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. ఆస్ట్రేలియా కోసం జరుగుతున్న ప్రత్యేకమైన రోజున వారు కోచ్‌లుగా కనపడనున్నారు. సచిన్‌, వాల్ష్‌లు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న ప్లేయర్లు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధిస్తే, వాల్ష్‌ టెస్టుల్లో 500 వికెట్లు పైగా పడగొట్టాడు. అటువంటి వారు పాల్గొంటున్న మ్యాచ్‌లో 'బిగ్‌ అప్పీల్‌' కోసం ఆస్ట్రేలియా క్రికెట్‌ కుటుంబం మొత్తం వస్తుంది. దేశ ప్రజలంతా దీనిలో పాల్గొంటారని ఆశిస్తున్నామని తెలిపింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.

 

కాగా, ఈ చారిటీ మ్యాచ్‌ ఫిబ్రవరి 8న జరగనుంది. అదే రోజున జరగనున్న బిగ్‌బాష్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఇది కర్టెన్‌ రైజర్‌ కానుంది. అయితే, వేదికను ఇంకా ఖరారు చేయలేదు. ఛారిటి మ్యాచ్‌లో పాంటింగ్, వార్న్‌తో పాటు జస్టిన్‌ లాంగర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌, బ్రెట్‌ లీ, షేన్‌ వాట్సన్‌, అలెక్స్‌ బ్లాక్‌వెల్, మైకేల్ క్లార్క్‌ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. స్టీవ్‌ వా, మెల్ జోన్స్‌ కూడా హాజరుకానున్నారు. వచ్చే రెండు వారాల్లో  'బిగ్‌ అప్పీల్'లో పాల్గొననున్న ఇతర ఆటగాళ్ల వివరాలు, దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ప్రకటించనుంది ఆస్ట్రేలియా. దీని ద్వారా వచ్చే డబ్బు మొత్తం ఆస్ట్రేలియా రెడ్‌ క్రాస్ డిజాస్టర్‌ రిలీఫ్‌& రికవరీ ఫండ్‌కు చేరుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: