న్యూజిలాండ్ తో జరిగిన రెండవ  టి 20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది . ఐదు టి 20 మ్యాచ్ ల  సిరీస్ లో ఈ విజయం ద్వారా  భారత్ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది . తొలుత బౌలర్లు సమిష్టిగా రాణించి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లను కేవలం 132 పరుగులకే కట్టడి చేశారు . జవాబుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు కేవలం 17. 3 ఓవర్లలోనే ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ఘన విజయం నమోదు చేసుకుంది .

 

సూపర్ ఫామ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (8) వరుసగా రెండవ మ్యాచ్ లోను విఫలమయ్యాడు . ఈ దశలో  మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ జత కలిశాడు . జట్టు స్కోరు 39 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ (11) సౌథీ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో ...  భారత్ జట్టు కూడా కష్టాల్లో పడినట్లు కన్పించింది . ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తక్కువ స్కోర్ కే  పెవిలియన్ దారి పట్టడం తో , జట్టు గెలుపు బాధ్యతలను తమ  భుజస్కందాలపై వేసుకున్న రాహుల్ (57) సమయోచితంగా ఆడుతూ 50 బంతుల్లో మూడు ఫోర్లు , రెండు సిక్సర్లతో అర్ధ సెంచరీ సాధించి జట్టును విజయాపథం లో నడిపించాడు . రాహుల్ అందించిన సహకారం తో శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ కు పని చెప్పాడు . 33 బంతుల్లో ఒక ఫోర్ , మూడు సిక్సర్లతో 44 పరుగులు సాధించి సోది బౌలింగ్ లో నిష్క్రమించాడు .

 

శివమ్ దూబే (8)తో కలిసి రాహుల్ విజయ లాంఛనాన్ని  పూర్తి చేశాడు . అంతకుముందు న్యూజిలాండ్ జట్టు ఓపెనర్లు గుప్తిల్ (33), మున్రో (26) శుభారంభమే అందించారు . కానీ మిగతా బ్యాట్స్ మెన్లు దాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును  భారీ  స్కోరు దిశగా నడిపించడం లో విఫలమయ్యారు . జడేజా రెండు వికెట్లు సాధించగా , ఠాకూర్ , బుమ్రా , దూబే తలొక వికెట్ చేజిక్కించుకున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: