భార‌త్ - న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సీరిస్‌లో హ‌మిల్ట‌న్‌లో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్‌పై న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త్ విసిరిన 348 ప‌రుగుల భారీ టార్గెట్‌ను న్యూజిలాండ్ కేవ‌లం 49 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కివీస్ జట్టు తొలి వన్డేతో కుదురుకుంది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు. అద్భుతంగా ఆడి కొండంత లక్ష్యాన్ని సైతం చిన్నగా మార్చేశారు. 

 

హెన్రీ, కెప్టెన్ లాథమ్‌లు అర్ధ సెంచరీలతో అదరగొట్టగా, రాస్ టేలర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 73 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదాడు. ఈ విజ‌యంతో మూడు వ‌న్డేల సీరిస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంత‌కు ముందు న్యూజిలాండ్ టాస్ గెలిచి భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భార‌త బ్యాట్స్‌మెన్స్ న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడి 348 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు.

 

శ్రేయస్‌ అయ్యర్‌(103; 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌(88 నాటౌట్‌; 64 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి(51; 63 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో భారత్‌ భారీ స్కోరును నమోదు చేసింది.  భారత్‌ ఇన్నింగ్స్‌ను పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ మ్యాచ్‌ ద్వారా వీరిద్దరూ వన్డే అరంగేట్రం చేసినా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఏదేమైనా భార‌త్ బౌల‌ర్ల వైఫ‌ల్యంతోనే తొలి వ‌న్డేలో భార‌త్ భారీ స్కోరు చేసినా ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: