ఆక్లాండ్ వేదికగా భారత్ తో జరిగిన రెండో వన్డే లో 22  పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డే ల సిరీస్ ను 2-0తో న్యూజిలాండ్  కైవసం చేసుకుంది.  ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన  న్యూజిలాండ్  నిర్ణీత 50ఓవర్ల లో 8వికెట్ల నష్టానికి 273పరుగులు చేసింది.  ఓపెనర్లు గప్తిల్ (79),హెన్రీ నికోల్స్ (41) అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వడంతో ఓ దశలో కివీస్ స్కోర్  300 దాటుతుందేమో అనిపించింది అయితే నికోల్స్  తరువాత కాసేపటికే బ్లండెల్ అవుట్ కావడంతో అక్కడి నుండి వికెట్ల పతనం స్టార్ట్ అయ్యింది. 27ఓవర్ల లో 142/2 గా వున్న స్కోర్ .. 42ఓవర్లకు వచ్చే సరికి 197/8 గా మారింది. ఈదశలో అనుభవజ్ఞుడైన ఆటగాడు రాస్ టేలర్ (73*),జైమీసాన్(25*)తో కలిసి పోరాడడం తో కివీస్  273 పరుగులు చేసింది. భారత్ బౌలర్ల లో చాహల్ 3, శార్దూల్ 2 వికెట్లు తీయగా జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. 
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు ఓపెన్లరు  శుభారంభాన్ని ఇవ్వడంలో మళ్ళీ  విఫలమయ్యారు. మూడో ఓవర్ లోనే మయాంక్ అగర్వాల్ వెనుదిరగగా  మరో రెండోవర్ల తరువాత పృథ్వీ షా కూడా  పెవీలియన్ చేరాడు అంతటి తో వికెట్ల పతనం ఆగలేదు.. కోహ్లీ , రాహుల్ , కేదార్ జాదవ్ ఇలా వచ్చి అలా వెనుదిరగడం తో 20ఓవర్లకే సగం వికెట్లు  కోల్పోయి భారత్  కష్టాల్లో పడింది. ఈదశలో జడేజా తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దూకుడుగా ఆడుతూ  హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శ్రేయస్(52) మరుసటి బంతికే అవసరం లేని షాట్ కు యత్నించి అవుట్ అయ్యాడు. ఆతరువాత వచ్చిన శార్దూల్  మూడు ఫోర్ల తో మెరుపులు మెరిపించి  వెనుదిరగగా ఓటమి ఖాయమనుకున్న దశలో సైని , జడేజా లు అద్భుతంగా పోరాడి  గెలుపు పై ఆశలు పెంచారు.  అయితే వేగంగా ఆడే క్రమంలో   229పరుగుల వద్ద  సైని (45)అవుట్ అవ్వగా  తరువాత కాసేపటికే చాహల్ రన్ అవుట్ అయ్యాడు. ఇక చివరి రెండు  ఓవర్ల లో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో  49ఓవర్ లో భారీ షాట్ కు యత్నించి  జడేజా క్యాచ్ అవుట్ అయ్యాడు దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: