మొదటి సారి అండర్ 19 ప్రపంచ కప్  గెలుచుకొని  బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఆదివారం టీమిండియాతో జరిగిన ఫైనల్ లో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో మూడు వికెట్ల తేడాతో గెలిచి మొదటి సారి ప్రపంచ కప్ ను ముద్దాడింది బంగ్లా అండర్ 19 జట్టు..  ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అద్భుతమైన ఫామ్ లో వున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ 88 పరుగులతో రాణించగా హైదరాబాదీ ఆటగాడు  తిలక్ వర్మ 38పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.  అయితే మిగతా  బ్యాట్స్ మెన్లు విఫలం కావడం తో భారత్ తక్కువ స్కోర్ కే  పరిమితమైంది. 
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన  బంగ్లాకు ఓపెనర్లు పర్వాలేదనే ఆరంభాన్నే ఇచ్చారు అయితే తొమ్మిదో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ హాసన్ రూపంలో తొలి వికెట్ కోల్పోవడంతో బంగ్లాదేశ్ వికెట్ల పతనం ఆరంభమైంది. 22 ఓవర్ల కు వచ్చే సరికి బంగ్లా స్కోరు 102/6 .. ఈదశలో ఓపెనర్ పర్వేజ్ , కీపర్ అక్బర్ అలీ కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. వీరిద్దరి బ్యాటింగ్ తో గెలుపు ఖాయమేననుకున్న తరుణంలో 143 పరుగుల దగ్గర పర్వేజ్ ఔట్ అయ్యాడు. ఇక అక్కడి నుండి హైడ్రామా స్టార్ట్ అయ్యింది. ఈవికెట్ కోల్పోయాక బంగ్లాకు ఒక్క రన్ చేయడానికి 20బంతులు అవసరం అయ్యాయి. 
 
ఇదే ఊపులో భారత్ మరో రెండు వికెట్లు తీసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ  ఒక్క వికెట్ కూడా పడగొట్టకపోవడంతో మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంది. అయితే 40వ ఓవర్ ముగిశాక వర్షం స్టార్ట్ కావడం తో  మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.  ఆతరువాత కాసేపటికే  తిరిగి మ్యాచ్  ప్రారంభం కాగా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో  46ఓవర్లో బంగ్లా లక్ష్యాన్ని 170పరుగులుగా నిర్ణయించారు.  43ఓవర్ మొదటి బంతికి రకీబుల్ హాసన్  సింగిల్ తీసి బంగ్లా విజయాన్ని ఖాయం చేశాడు. దాంతో వరుసగా రెండో సారి ఫైనల్ కు చేరిన భారత్ కు ఈసారి నిరాశ తప్పలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: