ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం జరిగిన బెనిఫిట్ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్... ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మ్యాచ్‌ మధ్యలో సరదాగా బ్యాటింగ్ చేసిన సచిన్  తొలి బంతినే బౌండరీ దాటించి... పాత రోజులను గుర్తుచేశాడు. దిగ్గజ క్రికెటర్లు ఆడిన చారిటీ మ్యాచ్‌లో పాంటింగ్ సేన.. గిల్‌ క్రిస్ట్ టీమ్‌పై విక్టరీ కొట్టింది. 

 

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్ధం జరిగిన బుష్‌ఫైర్‌ ఛారిటీ మ్యాచ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ ఎలెవ‌న్‌పై ఒక్క ప‌రుగు తేడాతో పాంటింగ్ ఎలెవ‌న్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో లెజండరీ క్రికెటర్లు అలరించారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టినా ఎంతో ఉత్సాహంగా ఆడారు. 

 

టాస్ ఓడి ఫస్ట్‌ బ్యాటింగ్ చేసిన పాంటింగ్ లెవ‌న్ నిర్ణీత 10 ఓవ‌ర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 104 ప‌రుగులు చేసింది. విండీస్‌ దిగ్గజం లారా 11 బంతుల్లో 30 పరుగులు చేసి ఔరా అన్పించాడు. అదే క్లాస్‌ హిట్టింగ్‌తో అలరించాడు. లారాతో పాటు పాంటింగ్‌, హేడెన్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పారు. యువరాజ్‌ సింగ్‌, సైమండ్స్‌ చెరో వికెట్‌ తీశారు. తర్వాత 105 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గిల్లీ సేన ఆరు వికెట్లు కోల్పయి 103 పరుగులే చేసింది. షేన్‌ వాట్సన్‌ 9 బంతుల్లో 30 పరుగులు చేశాడు. సైమండ్స్‌, గిల్‌క్రిస్ట్‌ బ్యాటింగ్‌లో తలా ఒక చెయ్యి వేశారు. 2 పరుగులతో యువీ నిరాశపరిచాడు. పాంటింగ్‌ ఎలెవన్‌ బౌలర్లలో బ్రెట్‌ లీ రెండు వికెట్లతో సత్తా చాటాడు.

 

మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో సచిన్‌ బ్యాటింగ్‌ చేయడం ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. పాంటింగ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సచిన్‌ను తమ బౌలింగ్ ఎదుర్కోవాలంటూ ఆస్ట్రేలియా విమెన్ టీం సభ్యులు కోరారు. దీనికి సరేనన్న మాస్టర్.. వెంటనే ప్యాడ్స్ కట్టుకొని గ్రౌండ్‌లో దిగిపోయాడు. తను ఎదుర్కొన్న తొలి రెండు బంతులనూ ఫోర్లుగా మలిచాడు. ఆస్ట్రేలియా మహిళా జట్టు సభ్యులు ఎలీస్ పెర్రీ, అనాబెల్ సదర్‌ల్యాండ్ మాస్టర్‌కి బౌలింగ్ చేశారు. సచిన్‌ బ్యాటింగ్‌ క్రికెట్‌ లవర్స్‌కి కిక్‌ ఇచ్చింది.>>

మరింత సమాచారం తెలుసుకోండి: