ప్రస్తుతం కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో వున్న టీమిండియా యువ బ్యాట్స్ మెన్ కమ్ కీపర్  కేఎల్ రాహుల్  సరికొత్త రికార్డు సృష్టించాడు.  నేడు కివీస్ తో జరుగుతున్న మూడో వన్డే లో భాగంగా 5వ స్థానం లో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ సెంచరీ తో రాణించాడు. తద్వారా వన్డేల్లో న్యూజిలాండ్ లో సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు వన్డే ల్లో ఆసియా అవతల సెంచరీ సాధించిన కీపర్ గా రాహుల్ లెజండరీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సరసన నిలిచాడు. ఇంతకుముందు  ద్రావిడ్ 1999లో ఇంగ్లాండ్  లో శ్రీలంక పై శతకం సాధించాడు. 
 
ఇక రాహుల్(112)కు తోడు శ్రేయస్ అయ్యర్ (62), పృథ్వీ షా (40),మనీష్ పాండే(42) రాణించడంతో టీమిండియా మూడో వన్డేలో నిర్ణీత  50ఓవర్ల లో 7వికెట్ల నష్టానికి 296పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలం కాగా కోహ్లీ కూడా తక్కువ స్కోర్ కే వెనుదిరిగి నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే  న్యూజిలాండ్ మొదటి, రెండు వన్డే ల్లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ మూడో వన్డేలోనైనా గెలిచి భారత్ పరువు నిలుపుకుంటుందో చూడాలి. కాగా మొదటి, రెండు వన్డేలకు దూరంగా వున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తాజాగా జరుగుతున్న మూడో వన్డే లో తిరిగి జట్టులో చేరాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: