ఇంగ్లండ్ ఫేస్‌బౌల‌ర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ వరుస బంతుల్లో ఆరు సిక్సులు కొడితేనే వామ్మో అనుకున్నాం. 2007 ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో బ్రాడ్ వేసిన ఆరు బంతుల‌ను యువ‌రాజ్ ఆరు సిక్సులుగా మ‌లిచాడు. అయితే ఇప్పుడు ఓకే ఓవ‌ర్లో ఓ ఆట‌గాడు ఏకంగా 77 ప‌రుగులు సాధించారు. అదేంటి 6 బంతుల‌ను 6 సిక్సులుగా మలిచినా 36 ప‌రుగులే వ‌స్తాయి. మ‌రి 77 ప‌రుగులు ఎలా ?  వ‌చ్చాయి అన్న సందేహం స‌హ‌జంగానే అంద‌రికి ఉంటుంది.



అయితే ఒకే ఓవ‌ర్లో 77 ప‌రుగులు వ‌చ్చిన విచిత్ర ఘటన ఫిబ్రవరి 20, 1990న చోటుచేసుకుంది. అయితే ఈ రికార్డు అంతర్జాతీయ మ్యాచ్‌లో కాకుండా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో జరిగింది. ఆ రోజు న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్‌, కాంటర్‌బరీ జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో వెల్లింగ్టన్‌ 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 291 పరుగుల లక్ష్య ఛేదనలో కాంటర్‌బరీ 108 పరుగులకే ఏనిమిది వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో ఎల్‌కే జర్మన్‌ (160 నాటౌట్‌), రోజర్‌ ఫోర్డ్‌ (14 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు.



ఇక కాంట‌ర్‌బ‌రీ జ‌ట్టు విజ‌యానికి రెండు ఓవ‌ర్ల‌లో 95 ప‌రుగులు చేయాలి. ఆ టైంలో  మ్యాచ్ డ్రా చేసుకోవాల‌ని కాంట‌ర్ బ‌రీ భావించింది. అయితే రెండు వికెట్లు తీస్తే గెలవచ్చని వెల్లింగ్టన్‌ భావించింది. దీంతో ఎలాగైనా గెలవాలని వెల్లింగ్టన్‌ కెప్టెన్‌ మెక్‌ స్వీనే బంతిని బ్యాట్స్‌మన్‌ రాబర్ట్‌ వాన్స్‌కు ఇచ్చాడు.
ఆ ఓవ‌ర్లో రాబ‌ర్ట్ వాన్స్ మొత్తం 22 బంతులు వేయ‌గా.. అందులో 17 నో బాల్స్ ఉన్నాయి.



కాంట‌ర్‌బ‌రీ బ్యాట్స్‌మెన్ జ‌ర్మ‌న్ 8 సిక్సులు, 5 ఫోర్లు బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 77 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే జర్మన్‌ శతకం కూడా సాధించిడం విశేషం. చివ‌రి ఓవ‌ర్లో 18 ప‌రుగులు రావాల్సి ఉండ‌గా.. కేవ‌లం 17 ప‌రుగులు రావ‌డంతో మ్యాచ్ డ్రా అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: